వైసీపీ కోసం మూడు రాజకీయ సినిమాలు!

Update: 2023-07-02 08:13 GMT

Full Viewఎన్నికల సీజన్ వస్తే రాజకీయ సినిమాల హడావుడి కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అదే జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కోసం మొత్తం మూడు సినిమా లు రెడీ అవుతున్నాయి. ఇవి అన్నీ కూడా ఎన్నికలను టార్గెట్ చేసుకుని తెరకెక్కించేవే అని చెప్పొచ్చు. కొన్ని సినిమా లు సొంత ఇమేజ్ ను పెంచుకునేవి అయితే మరి కొన్ని మాత్రం ప్రత్యర్థులను దెబ్బ తీయటానికి వాడుకునేవి. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చాలానే జరిగాయి. గత ఎన్నికల ముందు అంటే 2019 ఫిబ్రవరి లో విడుదల అయిన దివంగత రాజశేఖర్ రెడ్డి బయో పిక్ యాత్ర సినిమా వైసీపీ కి బాగానే ఉపయోగపడింది అనే చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు యాత్ర మూవీ ని తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ నే సీఎం జగన్ పాదయాత్ర విశేషాలతో పాటు పలు అంశాలతో యాత్ర 2 సినిమా పై అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమా కూడా 2024 ఫిబ్రవరి లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రకటన రోజే విడుదల తేదీని కూడా వెల్లడించారు.

                         ఇది ఒక ఎత్తు అయితే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఇప్పటికే సీఎం జగన్ కోసం రెండు సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి వ్యూహం అయితే రెండవది శపధం. ఇప్పటికే వ్యూహం సినిమా టీజర్ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలకు దాసరి కిరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈయన వైసీపీ నాయకుడు అనే విషయం తెలిసిందే. సీఎం జగన్ తో ఈ సినిమాల విషయంలో ఆర్జీవీ పలు మార్లు సమావేశం అయ్యారు కూడా. ఈ ప్రకటన వచ్చిన తర్వాతే నిర్మాత కిరణ్ కు టీటీడీ బోర్డు సభ్యత్వం కూడా ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా వర్క్ అవుట్ అవుతాయోమో కానీ అధికారంలో ఉండి సినిమాలను నమ్ముకుని ఫలితం సాదించగలరా అన్నది వేచి చూడాల్సిందే. డీబీటీ ద్వారా తాను గతంలో ఎవరూ చేయనట్లు ప్రజలకు మేలు చేస్తున్నా అని , తాను కేవలం ప్రజలనే నమ్ముకున్నట్లు చెప్పుకుంటున్న సీఎం జగన్ ఎన్నికల కోసం మూడు సినిమాల తో రంగం సిద్ధం చేసుకుంటున్న తీరు ఇప్పుడు కీలకంగా మారింది అనే చెప్పాలి. సీఎం జగన్ ప్రకటనల ద్వారా చేసుకునే ప్రచారం కూడా గత ప్రభుత్వాలను తలదన్నేలా పీక్ కు చేరిన విషయం తెలిసిందే. ఇది రాబోయే రోజుల్లో మరింత పెరగటం ఖాయం. దీనికి తోడు ఇప్పుడు మూడు సినిమాలు అన్న మాట.

Tags:    

Similar News