చంద్రబాబు ప్రకటన..టీడీపీ కి లాభమా..నష్టమా !

Update: 2023-04-25 12:37 GMT

తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సడన్ గా ప్రధాని మోడీ మద్దతు దారుగా మారిపోయారు. టీడీపీ నేతలు అందరు బీజేపీ తీరును తప్పుబడుతుంటే అయన అందుకు బిన్నంగా స్పందించటం ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ ప్రపంచ వ్యాప్తంగా దేశానికీ గుర్తింపు తెచ్చారు. ఎన్డీఏ అభివృద్ధి విధానాలపై ఎలాంటి వ్యతిరేకత లేదు. ప్రత్యేక హోదా విషయంలోనే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాము. మోడీ వల్లే ఇప్పుడు ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తుంది. మోడీ తెస్తున్న మార్పులు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ప్రధాని విధానాలకు మెరుగుపెడితే 2050 నాటికీ భారత్ దే అగ్రస్థానం అంటూ ఒక జాతీయ ఛానల్ నిర్వహించిన చర్చలో పాల్గొంటూ వ్యాఖ్యానించారు. 500 రూపాయల కంటే పెద్ద నోట్లు రద్దు చేయాలనీ కోరుతున్నట్లు తెలిపారు.పార్టీలు వేరైనా.. విజన్ ఉన్న నేతలుగా ప్రధాని మోడీ..తాను మాట్లాడుకున్నామని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ చేసే అడ్డగోలు అప్పులకు కేంద్రంలోని మోడీ సర్కారు సహకరిస్తోంది అని తెలుగు దేశం నాయకులు విమర్శిస్తారు. సీఎం జగన్ కు మోడీ పూర్తి అండదండలు అందిస్తున్నట్లు ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుతో పాటు ఇతర నాయకులు మాట్లాడారు. తాజాగా టీడీపీ నేతలు ఒక అడుగు ముందుకు వేసి టీడీపీ, జనసేన పొత్తు కుదరకుండా బీజేపీ కుట్రలు చేస్తోంది అని విమర్శించారు.

                                         ఈ విషయంలో ఆ పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలే చేశారు. వాస్తవానికి ప్రధాని మోడీ విషయంలో, బీజేపీ విషయంలో దేశం అంతటి పరిస్థితి కాసేపు పక్కన పెడితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తీవ్రమైన వ్యతిరేకతే ఉంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. విభజన హామీలు ఏవీ అమలు చేయకపోవటం ఒకటి...తాను శంఖుస్థాపన చేసిన రాజధాని అమరావతి కి కూడా రాజకీయంగా అండగా నిలబడక పోవటం వంటి అంశాలు ఎన్నో. కేంద్రం నేరుగా సాధ్యం కాదు అని చెపితే జగన్ సర్కారు అసలు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చేది కాదు అనే అభిప్రాయం ఉంది. అదే సమయంలో వైజాగ్ రాజధానిగా కేంద్రం అంటే ప్రధాని మోడీ కూడా ఓకే చేసినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలే ఉన్నాయి. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోడీ కి మద్దదుగా చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారాయి. బీజేపీ నేతలు టీడీపీ తో కలిసేదే లేదు అని పదే పదే ప్రకటిస్తున్నారు. ఈ తరుణంగా చందద్రబాబు మాటలు అటు మోడీ కి...బీజేపీ కి స్పష్టమైన సిగ్నల్స్ పంపటమే అనే అభిప్రాయం ఉంది. అయితే టీడీపీ బీజేపీ అనుకూల విధానం లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుంది అనే చర్చ కూడా సాగుతోంది. 

Tags:    

Similar News