ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో పాలన ఫోకస్ తప్పుతోంది. తమకు అవసరం అయిన వాటిని తప్ప ప్రజల అవసరాలపై ఏ మాత్రం దృష్టి పెడుతున్న దాఖలాలు కనిపించటం లేదు. వరసగా చోటు చేసుకుంటున్న ఘటనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం తిరుపతిలో చోటు చేసుకున్న దుర్ఘటన తర్వాత కూడా ఏ మాత్రం పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించటం లేదు. ఈ ఏడాది జనవరి 8 న తిరుపతిలో వైకుంఠఏకాదశి దర్శనం కోసం ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా..20 మందికిపైగా గాయాల పలు అయ్యారు. తిరుపతి చరిత్రలోనే ఇలాంటి ఘటన మాయని మచ్చగా నిలిచింది. మళ్ళీ బుధవారం నాడు సింహాచలం లక్ష్మి నరసింహస్వామి చందనోత్సవంలో జరిగిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మరణించారు. దర్శనం టికెట్స్ కోసం క్యూ లో నిలుచున్న భక్తులపై గోడ కూలి భక్తులు మరణించిన ఘటన ఒక్కసారిగా విషాదం నింపింది. కొద్ది రోజుల క్రితమే కట్టిన గోడ భారీ వర్షం కారణంగా కూలిపోయింది అని చెపుతున్నా..దీని నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అధికారులు చెపుతున్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఎలాగో సింహాచలం దేవాలయంలో చందనోత్సవం ప్రతియేటా జరుగుంది. వీటికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు అనే విషయం తెలిసిందే.
అయినా సరే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయటంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. కొంత మంది నిర్లక్ష్యం కారణంగా భక్తులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోనీ అధికారంలో ఉన్న వాళ్ళు ఏమైనా కొత్తగా అధికారంలోకి వచ్చారు వాళ్లకు ఎలాంటి పాలనా అనుభవం లేక పొరపాట్లు జరుగుతున్నాయి అని అనుకోవటానికి కూడా ఏ మాత్రం ఛాన్స్ లేదు. ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వరకు అందరూ సీనియర్లే. మరి లోపం ఎక్కడ ఉంది?. ఈ ప్రభుత్వం కేవలం తనకు కావాల్సిన అంశాలపై ఫోకస్ పెట్టి...మిగిలిన విషయాలు అన్నిటిని వదిలేసిందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఘటన జరిగిన వెంటనే హడావుడి చేయటం..విచారణ...ఎక్స్ గ్రేషియా లు ప్రకటించటం కాకుండా...అసలు ముందే ప్రమాదాలు జరగకుండా నివారించటానికి..ప్రజల ప్రాణాలు కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట. ఊహించని ప్రమాదాలను నివారించటం ఎవరి వల్ల కాదు..కానీ నిర్లక్ష్యం...అవినీతి కారణంగా జరుగుతున్న ప్రమాదాలను మాత్రం అడ్డుకునే ఛాన్స్ ఉంది. కాకపోతే ప్రభుత్వ పెద్దల ఫోకస్ వేరే వాటిపై ఉండటంతో భక్తులకు సంబంధించిన విషయాలను పట్టించుకోవటం లేదు అనే చర్చ సాగుతోంది.