పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను కొట్టేసిన హైకోర్టు
సర్కారుకు ఊరట
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎదురుదెబ్బ. ఆయన ఏకపక్షంగా జారీ చేసిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేవేసింది. ఏపీ సర్కారు తాము ఎన్నికలకు సిద్ధంగాలేము అని...ఓ వైపు కరోనా భయం,, మరో వైపు వ్యాక్సినేషన్ హడావుడి ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదు అంటూ వాదించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలసి ప్రభుత్వ ఆలోచనను వివరించారు. అయినా సరే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసి సంచలనం సృష్టించారు. దీన్ని అడ్డుకోవాలని కోరుతూ ఏపీ సర్కారు హైకోర్టును ఆశ్రయించింది.
ఏపీ హైకోర్టు కూడా ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకుని ఎస్ఈసీ జారీ చేసిన షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది. గత కొన్ని రోజులుగా ఏపీలో ఎస్ఈసీ, అధికార వైసీపీ మధ్య ఒక రకంగా అనధికార వార్ నడుస్తున్న పరిస్థితి ఉంది. అది ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంది. గతంలో ఎన్నడూ ఓ సారి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకున్న పరిస్థితులు లేవు. కానీ ఈ సారి మాత్రం అనూహ్యంగా హైకోర్టు నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వం చెప్పిన వ్యాక్సినేషన్ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.