జగన్ సన్నిహిత అధికారులకు ‘ఇది ఎంత మంచి ప్రభుత్వమో’
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం తనకు తాను ‘ఇది మంచి ప్రభుత్వం’ అని ప్రచారం చేసుకుంటోంది. ఇది ప్రజలకు ఎంత మంచి ప్రభుత్వమో తెలియదు కానీ...జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు పూర్తి స్థాయిలో అందండలు అందించిన అధికారులకు మాత్రం ఇది ఎంత మంచి ప్రభుత్వమో అన్న ఫీలింగ్ ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్ ల పీపీఏల్లో సవరణలు చేయాలని ప్రతిపాదించటంతో అప్పటిలో ఇది పెద్ద దుమారం రేపింది. ఈ విషయం లో ఏకంగా కేంద్రం కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరో వైపు విద్యుత్ కంపెనీలు కోర్టు ను ఆశ్రయించి వడ్డీతో సహా తమ బకాయిలు రాబట్టుకున్నాయి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ వడ్డీ మొత్తం వేల కోట్ల రూపాయల్లో ఉంది. సదరు ఐఏఎస్ ఆ వడ్డీ మొత్తంలో సగం ప్రభుత్వ పెద్దలకు ఇప్పించి...తన వాటా తాను తీసుకున్నట్లు విద్యుత్ శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ పెద్దలకు ఆ ఐఏఎస్ ఇప్పించిన మొత్తం వెయ్యి కోట్ల రూపాయలపైగానే. అంతే కాదు...గత ప్రభుత్వంలో జగన్ ఏది చెపితే అది చేసి పెట్టి అయన అస్మదీయ కంపెనీలకు దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయపైన ప్రాజెక్ట్ లు కట్టపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
అయినా చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కారు ఆ ఐఏఎస్ ను మాత్రం కొత్త అల్లుడిలాగా చూసుకుంటుంది అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఒక మెగా సంస్థతో పాటు జగన్ హయాంలో అనుచిత లబ్ధిపొందిన కంపెనీల నుంచి ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలు సర్దుబాటు చేయించినట్లు చెపుతున్నారు. ఆయన సెటిల్మెంట్ టాలెంట్ చూసిన తర్వాతే ప్రభుత్వం ఇప్పుడు ఆయన్ను అత్యంత కీలకమైన సిఎస్ పదవిలో కూర్చోబెట్టడానికి రంగం సిద్ధం చేసినట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. అంతే కాదు...సిఎస్ పదవి కట్టబెట్టి అది కాగానే అత్యంత కీలకమైన విద్యుత్ రంగంలో సలహాదారుగా కూడా నియమిస్తామని హామీ ఇచ్చినట్లు చెపుతున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి పెద్దలు చెప్పినట్లు చేసిన తరహాలోనే ఇప్పుడు కూడా ఆయన తన పని తాను చేస్తున్నారు.
సహజంగా ముఖ్యమంత్రులు ఐఏఎస్ అధికారులను బహిరంగ సభల్లో పొగిడారు. కానీ చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఆ ఐఏఎస్ ను బహిరంగ వేదికల మీదే పొగుడుతున్నారు అని...దీని వెనక ఆయన పని టాలెంట్ కంటే కూడా ఆయన సెటిల్ మెంట్స్ టాలెంట్ చూసి మాత్రమే అనే చర్చ ఐఏఎస్ అధికారుల్లో సాగుతోంది. ఒక వైపు జగన్ రాష్ట్రంలో వ్యవస్థలను కుప్ప కూల్చాడు...అధికారులతో ఇష్టానుసారం పనులు చేయించుకున్నాడు అని విమర్శలు చేస్తూ జగన్ కు అధికారంలోకి ఉన్నంత కాలం పెద్ద ఎత్తున లబ్ది చేకూర్చిన ఆ ఐఏఎస్ ను అదే కీలక స్థానంలో ఉంచటం ఒకెత్తు అయితే...ఇప్పుడు ఆయనకే సిఎస్ పదవి, ఆ తర్వాత సలహాదారు పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అనే చర్చలు చూసి ఐఏఎస్ అధికారులు కూడా అవాక్కు అవుతున్నాయి.