మస్తాన్ రావు సీటు ఆయనకే..మోపిదేవి సీటు ఇటు!

Update: 2024-10-14 08:06 GMT

వైఎస్ జమానాలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అతిపెద్ద స్కాముల్లో వాన్ పిక్ ప్రాజెక్ట్ పేరు చాలా ప్రముఖంగా వినిపించింది. అప్పటిలో టీడీపీ ఈ ప్రాజెక్ట్ పై తీవ్ర విమర్శలు కూడా చేసింది. విచిత్రం ఏమిటి అంటే ఈ స్కాం చోటు చేసుకున్న కాలంలో అప్పటి మౌలిక సదుపాయాల శాఖ మంత్రి గా ఉన్న మోపిదేవి వెంకటరమణ ఇటీవల టీడీపీ లో చేరారు. ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడుగా ఉన్న ఆయన తన పదవిని వదులుకున్న విషయం తెలిసిందే. నేరుగా ఈ స్కాం తో మోపిదేవికి సంబంధం లేకపోయినా అప్పటి మంత్రిగా ఆయన ఇప్పటికీ కేసు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మరో కీలక విశేషం ఏమిటి అంటే వాన్ పిక్ ప్రాజెక్ట్ సమయంలో అటు నిమ్మగడ్డ ప్రసాద్ టీం తో పాటు ఈ వ్యవహారంలో సానా సతీష్ కూడా చురుగ్గా పాల్గొన్నట్లు అప్పటిలోనే వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ లో సానా సతీష్ కు కొంత వాటా ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే సానా సతీష్ బాబు గతంలో మ్యాట్రిక్స్ న్యాచురల్ రిసోర్సస్ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా ఉన్నారు.

                                                                                                       ఇందులో నిమ్మగడ్డ ప్రకాష్ కూడా మరో డైరక్టర్. అయితే ఇప్పుడు మాత్రం సానా సతీష్ అందులో డైరెక్టర్ గా లేరు. ఇప్పుడు ఇది అంతా ఎందుకు అంటే సానా సతీష్ కు త్వరలోనే టీడీపీ తరపున రాజ్య సభ సభ్యత్వం దక్కబోతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల వైసీపీ కి రాజీనామా చేసిన ఎంపీల్లో బీద మస్తాన్ రావు సీటు ఆయనకే ఇస్తారు అని...విచిత్రంగా ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ సీటు సానా సతీష్ కు ఇస్తారు అని ఆ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ మేరకు సెటిల్ మెంట్స్ కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి అని ఒక సీనియర్ నేత వెల్లడించారు. వాస్తవానికి సానా సతీష్ కు ఇటీవల ముగిసిన ఎన్నికల ముందు జనసేన తరపున, టీడీపీ తరపున లోక్ సభ సీటు ఇచ్చే అవకాశం ఉంది అని ప్రచారం జరిగింది. కానీ పొత్తు లెక్కల్లో ఆయనకు సీటు దక్కలేదు. గత కొంత కాలంగా సానా సతీష్ ఏపీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు ఆయన టీం తో సన్నిహితంగా మెలుగుతున్నట్లు టీడీపీ వర్గాలు చెపుతున్నాయి.

                                                                             పార్టీ లో కిమ్ గా పేరున్న వ్యక్తిగా కూడా ఈయనకు బలమైన సంబంధాలు ఉన్నాయని..అందులో భాగంగానే త్వరలోనే రాజ్య సభ సభ్యత్వం దక్కే ఛాన్స్ ఉంది టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. ఒక వైపు జగన్ ను టీడీపీ నేతలు ఆర్థిక ఉగ్రవాది అని విమర్శిస్తూ...ఇప్పుడు పలు ఆరోపణలు ఎదుర్కొంటూ...గతంలో తీవ్రమైన కేసుల్లో ఉన్న సానా సతీష్ బాబు లాంటి వాళ్ళను తెర వెనక కోర్ టీంలో ఉంచుకుని పనులు చేసుకోవటం ద్వారా అటు పార్టీ నాయకులకు..ఇటు అధికారులకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో అర్ధం కావటం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పార్టీ నుంచి అధికారికంగా రాజ్య సభకు పంపిస్తే అంతకంటే దారుణం మరొకటి ఉండదు అని ఒక నేత వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News