కేంద్ర మంత్రి మాట‌లు నిజం కాదు

Update: 2021-10-11 11:32 GMT

బొగ్గు నిల్వ‌ల‌ల‌కు సంబంధించి కేంద్ర మంత్రి ఆర్ కె సింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఏపీ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి త‌ప్పుప‌ట్టారు. విద్యుత్ విషయంలో కేంద్ర మంత్రి చెప్పిన అంశంలో వాస్తవం లేద‌ని, ఆయన చెప్పిన అంశాలను ఖండిస్తున్నామ‌న్నారు. ఏపీలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. అంతర్జాతీయంగా, దేశీయంగా బొగ్గు లభ్యత లేకపోవడం,రేటు పెరగడం వల్ల సమస్య వచ్చిందని స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయ‌న సోమ‌వారం నాడు ప‌లు అంశాల‌పై మీడియా స‌మావేశంలో మాట్లాడారు. ప్ర‌స్తుతం డబ్బు పెట్టినా సమస్యను తీర్చే పరిస్థితి లేదని, ఇళ్లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని విజ్ణప్తి చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ప్రజలు రాత్రి 6-8 గంటల వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించాల‌ని, భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు అమలు చేయాల్సి రావచ్చని అన్నారు. సీఎం జగన్ ఇప్పటికే సమస్యను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరిన విష‌యాన్ని స‌జ్జ‌ల గుర్తుచేశారు. ఆయ‌న మీడియా స‌మావేశంలో కీల‌క వ్యాఖ్య‌లు ఆయ‌న మాట‌ల్లోనే..' ఇళ్ల స్థలాల పేరిట లబ్దిదారులకు తెలియకుండా కొందరు హైకోర్టులో కేసు వేయించారు.

రాజకీయ శక్తులు తెరవెనక ఉండి పన్నాగంతో దుష్టక్రీడకు తెరతీశాయి. 31 లక్షల మందికి గృహనిర్మాణాన్ని చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇళ్లనిర్మాణానికి హైకోర్టు తీర్పు శరాఘాతంలా మారింది. గతంలో ఉన్నట్లు అసైన్డ్ పట్టా కాకుండా ఒనర్ షిప్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో 17 వేల చోట్ల ఊళ్లు నిర్మితమవుతున్నాయి. కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం 10 వేల కోట్లు ఇప్పటికే ఖర్చు చేసింది. అఫిడవిట్లు వేయించి ఇళ్ల నిర్మాణాన్ని తెదేపా అడ్డుకుంటోంది. కోర్టు తీర్పు తాత్కాలిక అడ్డంకులే నని భావిస్తున్నాం. బద్వేలులో తెదేపా పోటీ పెట్టి ఉంటే బాగుండేది. భాజపా వారు మతం తప్ప దేన్నీ మాట్లాడటం లేదు. హిందువులకు అన్యాయం జరుగుతుందని ఆరోపణ‌లు చేస్తున్నారు. కేంద్రం చేసిన అప్పులు, రైతులను కారుతో తొక్కించిన దానిపై భాజపా వారు ఎందుకు మాట్లాడరు. జగన్ పై అపోహలు సృష్టించడం, గాలిప్రచారం చేసి మసి పూసేలా భాజపా నేతలు వ్యవహరిస్తున్నారు' అని మండిప‌డ్డారు.

Tags:    

Similar News