జ‌గ‌న్ ప్ర‌య‌త్నాల‌ను కెసీఆర్ అంగీక‌రించారు..ప్రోత్స‌హించారు కూడా

Update: 2021-07-02 12:42 GMT

స‌జ్జ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్టారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. రాయ‌ల‌సీమ‌కు నీటి విష‌యంలో కెసీఆర్ పెద్ద‌న్న‌గా ఉంటాన‌ని మాటిచ్చార‌ని తెలిపారు. అంతే కాకుండా జ‌గ‌న్ చేస్తున్న ఈ ప్ర‌య‌త్నాన్ని కెసీఆర్ గ‌తంలో అంగీక‌రించ‌ట‌మే కాకుండా ప్రోత్స‌హించార‌ని తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంల స‌మావేశంలో తాను కూడా ఉన్నాన‌ని స‌జ్జ‌ల తెలిపారు. ఆయ‌న శుక్ర‌వారం నాడు తాడేప‌ల్లిలో మీడియాతో మాట్లాడారు.నీటి విష‌యంలో ఇచ్చిపుచ్చుకునేలా ఉండాల‌ని కెసీఆర్ చెప్పార‌న్నారు. జ‌ల వివాదం ప‌రిష్కారం కావాల‌నే ఉద్దేశంతోనే సీఎం జ‌గ‌న్ ఈ అంశంపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి లేఖ రాశార‌న్నారు త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ నీరు తీసుకోవ‌ట‌మే రాయ‌ల‌సీమ ప్రాజెక్టు ల‌క్ష్యం అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల‌ సామ‌ర్ధ్యం ఉన్న‌ప్పుడు విద్యుత్ ఉత్ప‌త్తి ప్రారంభించాల్సి ఉండ‌గా..800అడుగుల కంటే త‌క్కువ సామ‌ర్ధ్యం ఉన్న‌ప్పుడు విద్యుత్ ఉత్ప‌త్రి ప్రారంభించార‌ని తెలిపారు.

                        దీని వ‌ల్ల ప్ర‌కాశం బ్యారేజ్ కు వ‌చ్చిన నీటిని వ‌చ్చిన‌ట్లు స‌ముద్రంలోకి వ‌దిలేయాల్సి వ‌స్తోంద‌ని అన్నారు. ఇలా అయితే భ‌విష్య‌త్ లో నీటికి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. స‌జ్జ‌ల ఈ అంశంపై ప‌లు మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడారు. ఏపీ వైపు నుంచి సంయ‌మ‌నం పాటిస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం భంగం కలగకుండా, పక్క రాష్ట్రంతో అనవసర వివాదాలు ఉండకూడదన్నదే త‌మ విధానం అని తెలిపారు. కనీస నీటి మట్టం లేకుండానే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నార‌ని..ఇది స‌రికాద‌న్నారు. రెండు రాష్ట్రాలు గొడవ పడే బదులు కేంద్రమే తన అధీనంలోకి తీసుకుని న్యాయం చేయటం మంచిదని వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించటం కోసం కొన్ని శక్తులు పని చేస్తున్నాయనే అనుమానాలు ఉన్నాయ‌న్నారు. అవసరమైతే ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత కేంద్రమే తీసుకోవాలని కోరతామ‌ని తెలిపారు.

Tags:    

Similar News