మోడీకి సీఎం జ‌గ‌న్ లేఖ‌

Update: 2021-06-29 15:22 GMT

ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో వ్యాక్సినేష‌న్ అంత వేగంగా సాగ‌టం లేద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా స‌ర‌ళ‌త‌రం చేసిన వ్యాక్సినేష‌న్ విధానం కింద 25 శాతం వ్యాక్సిన్ల‌ను ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు కేటాయించార‌ని..అయితే వాటిని ప్రైవేట్ ఆస్ప‌త్రులు ఉప‌యోగించుకోవ‌టం లేద‌న్నారు. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్ మంగ‌ళ‌వారం నాడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ వ్యాక్సిన్లను కూడా ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర నూత‌న విధానం ప్రకారం 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించారని.. ఇందులో చాలా వ్యాక్సిన్లు మిగిలిపోయాయని సీఎం లేఖలో పేర్కొన్నారు. ''జులై నెలలో ప్రైవేట్‌ ఆస్పత్రులకు 17,71,580 డోసులు కేటాయించారు.

ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను ప్రైవేట్‌ ఆస్పత్రులు వినియోగించుకునే అవకాశం లేదు. ప్రైవేట్‌ ఆస్పత్రులు తీసుకోనటువంటి వ్యాక్సిన్‌ నిల్వలను ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని'' సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఈనెల 24న జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ, ఇతర రాష్ట్రాలు ఇదే అంశాన్ని ప్రస్తావించాయని లేఖలో సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఇలా చేయ‌టం వ‌ల్ల వేగంగా వ్యాక్సినేష‌న్ పూర్తి అయి కేంద్రానికి మంచి పేరు వ‌స్తుంద‌ని తెలిపారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ అంశంపై నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఆశిస్తున్న‌ట్లు త‌న లేఖ‌లో ప్ర‌స్తావించారు. ఏపీలో ప్ర‌జలు ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో వ్యాక్సిన్ తీసుకోవ‌టానికి మొగ్గుచూపుతున్న‌ట్లు లేద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయ‌న్నారు.

Tags:    

Similar News