ఓ వైపు చిత్ర పరిశ్రమను క్షోభ పెడుతూ తామే పరిశ్రమను ప్రోత్సహిస్తామంటే నమ్మలా అంటూ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఏమైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోండి..కక్ష సాధింపులు బాక్సాఫీస్ వద్ద ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. భీమ్లానాయక్ ప్రదర్శించే థియేటర్ల వద్ద పోలీసు సిబ్బంది, ఇతర రెవెన్యూ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టిన అంశం దుమారం రేపుతోంది. అంతేకాకుండా ఈ సినిమాను టార్గెట్ చేసుకునే ఏపీ సర్కారు టిక్కెట్ ధరల పెంపు విడుదల జీవోను జాప్యం చేసిందనే విమర్శలూ ఉన్నాయి. సృజన, సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆదిపత్య ధోరణి ఏమిటి అని ఆయన ప్రశ్నించారు.
ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరన్నారు. ఇప్పటికైనా ఈ వివాదానికి, సినీ పరిశ్రమపై దాడికి ముగింపు పలకాలని ఆయన కోరారు. భీమ్లానాయక్ సినిమాకు ఏపీలో జరుగుతున్న అన్యాయంపై పరిశ్రమ తరపున ఎవరూ స్పందించకపోవటం సరికాదంటూ నాగబాబు మాట్లాడిన తర్వాత ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్ది నెలల క్రితం జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్రెసిడెంట్ గా పోటీచేసిన ఓటమి పాలైన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానల్ కు నాగబాబు బహిరంగ మద్దతు ప్రకటించారు.