ఈ మార్పు ఏపీకి మంచిదే

Update: 2025-01-17 15:14 GMT

రాజకీయ కారణాలో...లేక మరో కారణమో తెలియదు కానీ మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ సారి మారిపోయినట్లే కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో తొలిసారి ఏర్పాటు అయిన టీడీపీ ప్రభుత్వంతో...ఆ తర్వాత వచ్చిన జగన్ సర్కారు తో వ్యవహరించిన దానికి భిన్నంగా ఇప్పుడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా టీడీపీ, బీజేపీ లు భాగస్వాములుగా ఉన్నాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పాటులో కూడా టీడీపీ ఇప్పుడు కీలక భాగస్వామిగా ఉంది. అయినా కూడా టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్స్ మోడ్ ను వదిలేసి.. కేంద్రంతో సఖ్యతతో ఉంటూ సాధ్యం అయినంత మేర ఎక్కువ ప్రయోజనాలు తెచ్చుకునే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి అవసరమైన నిధులు, పోలవరం ప్రాజెక్ట్ వేగంగా ముందుకు వెళ్లేలా ఏర్పాట్లు..రైల్వే జోన్ తో పాటు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ప్రయోజనాలు దక్కించుకునే పనిలో పడ్డారు.

                                                                   కొద్ది నెలల క్రితం వరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్ప మరో మార్గం లేదు అంటూ చెప్పుకొచ్చిన కేంద్రం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు 11440 కోట్ల రూపాయల పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తిరిగి గాడిన పడే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ కు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రైవేటీకరణ బారి నుంచి బయటపడినట్లే. కేంద్రం ఈ ప్రాజెక్ట్ పునరుద్దరణకు 11440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించినందున ఇప్పుడు అసలు ప్రైవేటీకరణ అన్న ప్రశ్న ఉత్పన్నం కాదు అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెపుతున్నారు. పునరుద్ధరణ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ కి ఆయన ధన్యవాదాలు తెలుపుతూ...ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కార్మికులు..స్టీల్ ప్లాంట్ మేనేజ్ మెంట్ పైనే ఉంది అన్నారు.

                                                             కారణాలు ఏమైనా కూడా ఈ టర్మ్ లో మోడీ సర్కారు ఏపీ విషయంలో పూర్తిగా మారిపోయి పలు నిర్ణయాలు ఆంధ్ర ప్రదేశ్ కు మేలు చేసేలా తీసుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇవి కచ్చితంగా రాష్ట్రానికి మంచి చేసేవే అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రత్యేక హోదా తో పాటు విభజన హామీలు చాలా వరకు మోడీ సర్కారు పక్కన పెట్టిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా కొన్ని కీలక ప్రాజెక్ట్ ల విషయంలో అయినా కూడా సానుకూలంగా స్పందించటం కీలక పరిణామంగానే చెప్పుకోవాలి. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అధీనంలో ఉన్న భూముల విషయంలో కేంద్రం రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

                                                                         ప్రస్తుతానికి కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ లు భాగస్వాములుగా ఉన్నా కూడా రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు అటు ఇటు మారినా కూడా రాజకీయాయంగా నష్టపోకుండా ఈ సారి ఏపీ బీజేపీ అడుగులు వేస్తుంది అనే చర్చ కూడా ఉంది. మొన్నటి ఎన్నికల ముందు వరకు కూడా ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ పై ఎలాంటి సానుకూల అభిప్రాయం లేకపోగా..పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. కానీ ఇప్పుడు అమరావతి, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి వాటి విషయంలో మోడీ సర్కారు తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో కొంతలో కొంత బీజేపీ కి సానుకూల వాతావరణం తెచ్చిపెడతాయి అని భావిస్తున్నారు. మరో వైపు ఏదైనా కారణంతో టీడీపీ నుంచి దూరం జరగాల్సి వచ్చినా పవన్ కళ్యాణ్ ను ముందు పెట్టి బీజేపీ రాజకీయం చేసే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఏపీలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అడుగులు కూడా ఆ దిశగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. రాజకీయాలు ఎలా ఉన్నా కూడా కొంతలో కొంత ఈ సారి కేంద్రం నుంచి ఏపీ కి అనుకూలంగా వస్తున్న నిర్ణయాలు రాష్ట్రానికి మేలు చేసేవే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News