ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం కాక రేపుతోంది. ఎస్ఈసీ నమ్మగడ్డ రమేష్ కుమార్ తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయగా..సర్కారు మాత్రం తాము ఇదేమీ పట్టించుకోమని..సుప్రీంకోర్టు తీర్పు వచ్చాకే చూసుకుంటామని చెబుతోంది. ఈ అంశంపై ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఎన్నికల కమిషన్‌కు ఉద్యోగులు సహకరించరని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.
సుప్రీంకోర్టులో కేసు ఉండగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. కరోనాకు వ్యాక్సినేషన్ జరుగుతుండగా నోటిఫికేషన్ ఇచ్చారని పేర్కొన్నారు. నిమ్మగడ్డతో కొందరు వ్యక్తులు కలిసి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో కుమ్మక్కు అయి రమేష్ కుమార్ ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు.