అది కంపెనీ అయినా..పార్టీ అయినా కష్టపడి పనిచేసే వాళ్ళు కొంత మందే ఉంటారు. మరి కొంతమంది పని కంటే షో నే ఎక్కువ చేస్తుంటారు. విచిత్రం ఏమిటి అంటే రెండు చోట్లా అంటే అటు కంపెనీల్లో..ఇటు పార్టీల్లో కూడా కష్టపడి పనే చేసే వాళ్ల కంటే షో చేసే వాళ్ళు ఎక్కువ మైలేజ్ తీసుకుంటారు...అన్నిరకాలుగా ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఇది అంతా ఇప్పుడు ఎందుకు అంటే పైన కనిపిస్తున్న ఫోటో లో టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గురించి టీడీపీ లో సాగుతున్న చర్చ ఇది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 52 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉండి...వైద్య చికిత్సల కోసం మధ్యంతర బెయిల్ పై మంగళవారం సాయంత్రం విడుదల అయినా విషయం తెలిసిందే. చంద్రబాబు జైలు లో ఉన్న ఈ 52 రోజుల్లో పయ్యావుల కేశవ్ పట్టుమని ఐదు రోజులు మంగళగిరి పార్టీ కార్యాలయం వైపు వచ్చి ఉంటారేమో అని టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. మిగిలిన సమయంలో అయన పార్టీ కోసం ఏమి చేశారో ఎవరికీ తెలియదు అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. గత నెలలో పయ్యావుల కేశవ్ ములాఖత్ లో చంద్రబాబు తో కూడా సమావేశం అయ్యారు.
బయటకి వచ్చాక తనను చంద్రబాబు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల కృష్ణా జలాల పరిస్థితి ఏంటి అని అడిగారు అని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉండాలని కోరినట్లు వెల్లడించారు. కానీ పయ్యావుల కేశవ్ అటు కృష్ణా జలాల విషయంలో కానీ...అయన చెప్పిన ప్రజల సమస్యలపై జగన్ సర్కారుకు వ్యతిరేకంగా నోరు విప్పి పెద్దగా మాట్లాడింది ఏమి లేదు అని పార్టీ నాయకులే చెపుతున్నారు. కానీ చంద్రబాబు విడుదల అయ్యే సమయానికి వచ్చి అయన కారు లో కూర్చుని కరెక్ట్ గా ఫోటో లో ఎలా ఉంటే పడతామో చూసుకుని ముందుకు వంగి మరీ కూర్చున్నారు అని ఒక నేత వ్యాఖ్యానించారు. కారు లోకి రమ్మని చంద్రబాబే పిలిచి ఉండొచ్చు కానీ...మార్కెటింగ్ చేసుకోవటం ఎవరైనా కేశవ్ దగ్గరనుంచే నేర్చుకోవాలనే చర్చ టీడీపీ లో సాగుతోంది. గత 52 రోజుల్లో బయట ఏమి జరిగిందో..ఎవరు ఎలా పని చేశారో వాస్తవాలు తెలుసుకుని చంద్రబాబు ఇకనైనా నిర్ణయాలు తీసుకుంటే బాగుటుంది అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.