ప్రెస్ మీట్ లోనే భాష వాడకంపై వివరణ
ఎవరికి ఈ సందేశం
పయ్యావుల కేశవ్. పీఏసీ ఛైర్మన్. ఇంత కాలం సీఎం జగన్ పై విమర్శలు చేసే విషయంలో ఆయన నిన్నటి వరకూ ఎలా జాగ్రత్తలు పాటిస్తూ వచ్చారు. ఏమైనా మాట్లాడాల్సి వచ్చినా ఎంత సేపూ ప్రభుత్వం..అధికారులపై తప్ప..ఎప్పుడూ సీఎం జగన్ పై విమర్శలు చేయటానికి కేశవ్ ఆసక్తి చూపలేదు. ఆర్ధిక శాఖలో అవకతవకలు, విద్యుత్ అంశాలపై మాట్లాడినా కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డినో లేదా అధికారులపై విమర్శలు చేసేవారు. అది చంద్రబాబు ప్రభుత్వం అయినా..జగన్ ప్రభుత్వం అయినా నిర్ణయాలు మెజారిటీ సీఎం స్థాయిలోనే ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. అయితే మనకెందుకు వచ్చిన గొడవ అన్నట్లుగా పయ్యావుల కేశవ్ ఇంత కాలం తప్పించుకుంటూ వచ్చారు. చంద్రబాబు, నారా లోకేష్, ఇతర టీడీపీ నేతలు అందరూ నేరుగా సీఎం జగన్ ను పలు అంశాలపై విమర్శలు గుప్పించినా ఆయన మాత్రం నా స్టైల్ నాదే అంటూ జగన్ తప్ప అంటూ అందరిపై మాట్లాడేవారు. కానీ అకస్మాత్తుగా శనివారం నాడు తన కేశవ్ సహజ ధోరణికి భిన్నంగా జగన్ పై డైరక్ట్ ఎటాక్ కు దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ల నుంచి సెగ తగిలిందా లేక తనంతట తాను మాట్లాడారా అన్న చర్చ టీడీపీలో సాగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండేళ్ళ పాటు మౌనాన్నే ఆశ్రయించారు. గత కొంత కాలంగా ఎంపిక చేసిన అంశాలపై మాత్రం మాట్లాడుతూ వస్తున్నారు.
శనివారం నాడు ఏకంగా సీఎం జగన్ పై పీకుడు బాషతో దాడికి దిగారు. ఇది చూసి టీడీపీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. 'సీఎం జగన్ తన బలహీనతను కప్పిపుచ్చుకోవటానికే ఈ భాష మాట్లాడారు. జగన్ పీకుడు భాషలోనే చెప్పాలంటే మూడేళ్లు నువ్వు ఏమి పీకావు. రాయలసీమ ప్రాజెక్టుల్లో ఏమి పీకావు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్లో ఏమి పీకావు. పోలవరం ప్రాజెక్టులో ఏమి పీకావు. అమరావతిలో అవినీతి అన్నావు ఏమి పీకావు. ఫైబర్ గ్రిడ్ లో అవినీతి అన్నావు ఏమి పీకావు. ఏమి పీకావో చెప్పాలంటే ఒక పుస్తకం అవుతుంది. ఏమి పీకలేదో చెప్పాలంటే పది పుస్తకాలు రాయోచ్చు. ప్రజల జీవితాల్లో వెలుగులు పీకారు. ప్రజా వేదికను పీకారు. అన్నా క్యాంటీన్లను పీకారు. ఇవాళ కరెంట్ పీకుతున్నారు. ప్రజల ఆశల సౌధాలను పీకుడుతున్నారు. ప్రజల జీవితాల్లో సంతోషాలు. వెలుగులను పీకుతున్నారు. ఢిల్లీకి వెళ్ళి ఏమి పీకారు.
ప్రత్యేక హోదా సాధించారా?. మీరు ఢిల్లీ వెళుతున్నది పీకటానికా?. పీకించుకోవటానికా?. పీపీఏల్లో అవినీతి అన్నారు. ఏమి పీకారు. కోడికత్తి మీద ఏమి పీకారు. బాబాయి హత్యమీద ఏమి పీకారు. ఈ భాష నేను మాట్లాడటానికి ఇష్టపడను. ముఖ్యమంత్రి ఉపయోగించిన తర్వాత అందరూ ఆ భాష వాడితే ఎలా ఉంటుందో చెప్పటం కోసమే ఈ పీకుడు భాష వాడాల్సి వచ్చింది . సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెడతామని ఏమి పీకారు. ఎన్నికల్లో గొప్పగా వాగ్దానం చేశారు కదా. ' అంటూ కేశవ్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్‌ను ప్రజలు పీకేసే రోజులు దగ్గర్లో ఉన్నాయని వ్యాఖ్యానించారు. క్యాబినెట్‌లో ఎంతమందిని జగన్ పీకుతారో రేపు చుద్దామని...అసలు పీకేను పీకే దమ్ము జగన్‌కు ఉందా? అని ప్రశ్నించారు. రాయలసీమలో ఎంత మంది మంత్రులను పీకగలరో చూద్దామని అన్నారు. ''సొంత క్యాబినెట్‌ను మార్చుకోలేనివాడు.. ప్రతిపక్షాల పీకుతారా? అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారుతున్నందునే పీకుడు భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది అంతా ఒకెత్తు అయితే ఈ పీకుడు భాష ఎందుకు వాడాల్సి వచ్చిందో కూడా ఆయన మీడియా సమావేశం వేదికగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయటం మరో విశేషం.