అప్పు ఇస్తే చాలు..ఎక్క‌డైనా సంత‌కాలు పెడ‌తారా?.

Update: 2021-07-22 08:41 GMT

స‌ర్కారుపై ప‌య్యావుల కేశ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అప్పుల కోసం బ్యాంకుల‌తో స‌ర్కారు ర‌హ‌స్య ఒప్పందాలు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏమి ఉంద‌ని తెలుగుదేశం సీనియ‌ర్ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్ ప్ర‌శ్నించారు. ఒప్పందాల‌ను ర‌హ‌స్యంగా ఉంచాల‌ని బ్యాంకుల‌కు ష‌ర‌తు పెట్టాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని అన్నారు. ఇది ఏమైనా ప్రైవేట్ వ్య‌వ‌హ‌ర‌మా? అని ప్ర‌శ్నించారు. స‌ర్కారు తీరు చూస్తుంటే అప్పు ఇస్తే చాలు ఎక్క‌డ పెట్ట‌మంటే అక్క‌డ సంత‌కాలు పెట్టేలా ఉంద‌ని ఎద్దేవా చేశారు. పాతిక వేల కోట్ల రూపాయ‌ల అప్పు కోసం ప్ర‌భుత్వం రాష్ట్ర సార్వ‌భౌమ అధికారాన్ని కూడా వ‌దులుకోవ‌టానికి సిద్ధ‌ప‌డింద‌ని అన్నారు. ఈ లెక్క‌న ప్ర‌భుత్వం గ్యారంటీగా ఇచ్చిన అప్పు చెల్లించ‌క‌పోతే గ‌వ‌ర్న‌ర్ పై కూడా కేసు పెట్టే అవ‌కాశం ఉంద‌న్నారు. రాజ్యాంగం ప్ర‌కారం రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్ వంటి వారికి ర‌క్షణ ఉంటుంద‌ని..ఈ ప్ర‌భుత్వం దాన్ని కూడా వ‌దులుకోవ‌టానికి సిద్ధ‌ప‌డిన‌ట్లు ఒప్పందాల్లో ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అప్పు కోసం బ్యాంకుల‌తో ర‌హ‌స్య ఒప్పందాలు ఎందుకు? ఆ ఒప్పందాల్లో ఉన్న ర‌హ‌స్యాలు ఏంటో ప్ర‌జ‌ల‌కు తెలియాల‌న్నారు. ప‌య్యావుల కేశ‌వ్ గురువారం నాడు అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడారు. పాతిక వేల కోట్ల అప్పుకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు..బ్యాంకు గ్యారంటీలు లేవ‌ని మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి మీడియాకు చెప్పార‌ని..కానీ ఇవిగో ఒప్పందాలు అంటూ కేశ‌వ్ కొన్ని ప‌త్రాల‌ను మీడియాకు చూపించారు. స‌హ‌జంగా గ‌వ‌ర్న‌ర్ ను సంభోధించే స‌మ‌యంలో హిజ్ ఎక్స్ లెన్సీ అని రాస్తార‌ని..ఇది ప‌ద్ద‌తి అని..కానీ ప్ర‌భుత్వం మాత్రం ఒప్పందాల్లో కూడా నేరుగా గ‌వ‌ర్న‌ర్ పేరును రాసేసింద‌ని చూపించారు.

ప్ర‌భుత్వ అప్పులు తీరు చూస్తుంటే నా ఆదాయమే కాదు... నా కొడుకు ఇంజ‌నీరింగ్ చ‌దివాడు..వాడికి ఇంత జీతం వ‌స్తుంది అని వాడికి వ‌చ్చే జీతం కూడా చూపెట్టి స‌ర్కారు అప్పులు తెచ్చుకుంటోంద‌ని..భ‌విష్య‌త్ త‌రాల‌ను కూడా తాక‌ట్టుపెడుతోంద‌ని ద్వ‌జ‌మెత్తారు. ఇలా చేసే అధికారం ప్ర‌భుత్వానికి లేద‌న్నారు. అస‌లు కేంద్రం, ఆర్ బిఐకి తెలిసే ఈ అప్పులు చేశారా? అని ప్ర‌శ్నించారు. బైబిల్, ఖురాన్, భ‌గ‌వ‌ద్గీత అంటూ మేనిఫెస్టోలో మ‌ద్య‌పాన నియంత్ర‌ణ‌, నిషేధం అని చెప్పి మ‌ద్యం ద్వారా వ‌చ్చే డ‌బ్బును చూపెట్టి 25 వేల కోట్లు అప్పు ఎలా తెస్తార‌ని ప్ర‌శ్నించారు. అస‌లు మ‌ద్య నిషేధం అమ‌లు చేస్తారా లేదా అని ప్ర‌శ్నించారు. అప్పులు ప్ర‌భుత్వంలో భాగ‌మే అయినా..అవి కూడా రాజ్యాంగం ప్ర‌కారం..నిబంద‌న‌ల ప్ర‌కార‌మే చేయాల‌న్నారు. ఈ ఒప్పందాల‌ను రేపు వ‌చ్చే గ‌వ‌ర్న‌మెంట్ కొన‌సాగించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇప్ప‌టికైనా ఈ పాతిక వేల కోట్ల రూపాయ‌ల అప్పు వివ‌రాలు ప్ర‌జ‌ల మందు పెట్టండి. నిబంధ‌న‌ల ప్ర‌కారం చేయండి అన్నారు. ఇదేదో నా ప్రైవేట్ ఖ‌జానా నా ఇష్ట‌ప్ర‌కారం చేస్తామంటే అంటే అది జ‌ర‌గ‌ద‌న్నారు. ఏదైనా నిబంద‌న‌ల ప్ర‌కారం సాగాల‌న్నారు.

Tags:    

Similar News