టీడీపీ హయాంలో అయితే ఏ నిర్ణయం అయినా చంద్రబాబు అభిమతం మేరకే జరుగుతుందనే విషయం తెలిసిందే. అలాగే వైసీపీ హయాంలో సీఎం జగన్ కనుసన్నల్లో నిర్ణయాలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే పయ్యావుల కేశవ్ మాత్రం సీఎం జగన్ పై ఎక్కడా విమర్శలు చేయకుండా వచ్చారు. ఇప్పుడు కారణాలేమిటో కానీ విద్యుత్ స్కామ్ అంశాన్ని వదిలేశారు..ఆర్ధిక అంశాలపై మాత్రం అప్పుడు వైసీపీ ప్రభుత్వం..అధికారులు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తాజాగా లేపాక్షి భూముల వ్యవహారంలో పయ్యావుల కేశవ్ నేరుగా సీఎం జగన్ పేరును ప్రస్తావించటం టీడీపీ నేతలను కూడా ఒకింత షాక్ కు గురిచేసిందనే చర్చ సాగుతోంది. ఇంత కాలం ప్రభుత్వం ప్రభుత్వం అంటూ మాట్లాడి ఇప్పుడు నేరుగా సీఎం జగన్ పై పయ్యావుల కేశవ్ నేరుగా విమర్శలు చేయటం వెనక వ్యక్తిగత ఏజెండా ఉందనే వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల నుంచే విన్పిస్తున్నాయి. పది వేల కోట్ల రూపాయల భూమిని 500 కోట్ల రూపాయలకే ఇస్తారా..ఈ కుట్ర అంతా సీఎం కనుసన్నల్లోనే సాగిందని కేశవ్ విమర్శలు గుప్పించారు. మరి ఈ అంశంపై అయినా ఓ తార్కిక ముగింపు వరకూ ప్రయత్నం చేస్తారా..లేక గతంలో మాదిరే మధ్యలోనే వదిలేస్తారా అన్నది వేచిచూడాల్సిందే.