ఏపీ ఆర్ధిక వ్యవస్థలో బయటకు రావాల్సిన కీలక అంశాలు ఎన్నో ఉన్నాయని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. సర్కారు అప్పులపై కాగ్ తో, బ్యాంకు రుణాలపై కేంద్రంలోని అత్యున్నత విచారణ సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓ చిన్న ఫిర్యాదుతోనే కేంద్రం ఏపీ సర్కారు తప్పులు చేస్తుందనే విషయాన్ని గుర్తించి తాజాగా సర్కారుకు లేఖ రాసిందని అన్నారు. దీంతో ఇప్పటివరకూ తాము చెప్పిన విషయాలు కరెక్ట్ అని నిర్దారణ అయ్యాయన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరీ ఏపీ సర్కారు అప్పులు చేస్తోందని విమర్శించారు. ఇలాచేస్తూ కూడా ప్రభుత్వం తమను ఎవరూ ఏమీ చేయలేరు అన్నట్లు వ్యవహరించటం దారుణమన్నారు. జరుగుతున్న పొరపాట్లను తాము వెలుగులోకి తెస్తే తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోగా బుకాయించే ప్రయత్నం చేశారన్నారు. తాము చెప్పేది సీఎం జగన్, ఆర్ధిక మంత్రి బుగ్గనకు వ్యతిరేకంగా కాదన్నారు. వ్యవస్ధలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కానీ వీళ్లు మాత్రం వ్యవస్థలు కుప్పకూలే చేస్తున్నారని విమర్శించారు. పయ్యావుల కేశవ్ సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ అతి పెద్ద ప్రమాదంలో పడబోతుందని హెచ్చరించారు. ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నారో అర్ధం కావటంలేదని వ్యాఖ్యానించారు. ఈ తతంగం అంతా ముఖ్యమంత్రికి తెలుసా?. మంత్రికి తెలుసా? అన్నది తనకు తెలియదన్నారు. అధికారులకు తెలియకుండా ఇంత పెద్ద విషయం ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో ఏపీ విషయాలు అతి పెద్ద చర్చకు దారితీయబోతున్నాయని తెలిపారు. ప్రతిపక్షంలో ఉండగా అప్పులు ఎలా చేస్తారు అన్నారు..ఇప్పుడు మాత్రం అప్పులు చేయాల్సిందే అంటున్నారని బుగ్గనను ఎద్దేవా చేశారు. ప్రభుత్వాలు అప్పులు చేయటం సహజమే అన్నారు. గవర్నర్ కార్యాలయం కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన వాటిని వచ్చినట్లు ఆమోదించి పంపటం కాకుండా వాటిని అధికారులు సరిగా చూడాలని సూచించారు. భవిష్యత్ లో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టుపెట్టడం అనేది అతి పెద్ద రాజ్యాంగ ఉల్లంఘన అన్నారు.