లెజిస్లేటివ్ వ్యవహారాలు అన్నీ చూసుకోవాల్సింది శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రే. అయన తర్వాత బాధ్యత చీఫ్ విప్ ది. కానీ వీళ్ళిద్దరూ దారుణంగా విఫలం అయ్యారు అనే చర్చ టీడీపీ నేతల్లోనే సాగుతోంది. అసెంబ్లీకి కేవలం అతి తక్కువ మంది హాజరు అయినా కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందే కానీ..ఇటు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి కానీ...అటు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కానీ ఆ పరిస్థితి రాకుండా చూడటంలో విఫలం అయ్యారు అని చెపుతున్నారు. మరో వైపు కౌన్సిల్ లో చోటు చేసుకున్న వ్యవహారం తాజాగా కూటమి సర్కారును ఇప్పుడు మరింత ఇరకాటంలో పడేస్తోంది. ప్రోటోకాల్ ప్రకారం చూస్తే శాసనసభ స్పీకర్ కంటే మండలి స్పీకరే ముందువరసలో ఉంటారు. కానీ తాజాగా అసెంబ్లీ లో జరిగిన విప్ లతో పాటు ఇతర అవసరాల కోసం కొత్తగా కట్టిన భవనం ప్రారంభోత్సవానికి కూడా మండలి చైర్మన్ మోషేనురాజును ఆహ్వానించలేదు అని మండలి లో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు.
అంతే కాదు శిలాఫలకంలో కనీసం ఆయన పేరు కూడా వేయలేదు అన్నారు. ఇది ఒక్కటే కాదు...ఇటీవల తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా సాధికార సదస్సుకు కూడా కనీసం మండలి చైర్మన్ కు ఆహ్వానం లేదన్నారు. దళితుడు అయినందునే ప్రోటోకాల్ పాటించకుండా మండలి చైర్మన్ ను అవమానిస్తున్నారు అని బొత్స ఆరోపించారు. ఇది రాజకీయంగా టీడీపీని...కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ప్రోటోకాల్ ప్రకారం చైర్మన్ ను ఆహ్వానించకపోవటం తప్పే అని మంత్రి అచ్చం నాయుడు అంగీకరిస్తూ ఈ విషయంలో పొరపాటు ఎక్కడ జరిగిందో చూసి చర్యలు తీసుకుంటాం అన్నారు. వాస్తవానికి ఇవి అన్ని కూడా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చూసుకోవాల్సిన వ్యవహారాలు అని...ఈ విషయంలో ఆయన ఫెయిల్ కావటంతో తాము ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అని కొంత మంది మంత్రులు అభిప్రాయపడుతున్నారు. పయ్యావుల కేశవ్ ఎంత సేపు ఛాన్స్ దొరికిన ప్రతిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లను పొగిడితే చాలు తన పదవి సేఫ్ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
చీఫ్ విప్ జీ వి ఆంజనేయులు కూడా ఈ బాధ్యతల్లో సమర్ధవంతంగా వ్యవహరించలేకపోతున్నారు అనే విమర్శలు టీడీపీ ఎమ్మెల్యేల నుంచే వినిపిస్తున్నాయి. సభలో ప్రతిపక్షం లేకపోయినా కూడా కూటమి ఎమ్మెల్యే ల మధ్య ఏ మాత్రం సయోధ్య లేదు అనే విషయం ఇటీవల పలు మార్లు నిరూపితం అయింది. ఒక్క శాసనసభా వ్యవహారాల్లోనే కాదు ఆర్థిక శాఖ కు చెందిన విషయాల్లో కూడా పయ్యావుల కేశవ్ దారుణంగా ఫెయిల్ అయ్యారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆర్థిక మంత్రి దగ్గర ఫైల్స్ ఎక్కువ రోజులు పెండింగ్ లో ఉంటున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి. ఏ మంత్రి దగ్గర అయినా ఫైల్స్ ఎక్కువ రోజులు ఎందుకు ఆగుతాయో ప్రభుత్వ వ్యవహారాలు తెలిసిన ప్రతిఒక్కరికి అవగతమే. అంతే కాదు ఆర్థిక శాఖలో టీడీపీ నేతల కంటే కూడా వైసీపీ నేతలకే వేగంగా పనులు అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బిల్స్ క్లియరెన్స్ తో పాటు పలు విషయాల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుంది అని చెపుతున్నారు. ఆర్థిక శాఖకు చెందిన వ్యవహారాల్లో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఎక్కువ గా ఉంది అని...కొంత మంది బయట ఆఫీస్ లు పెట్టి మరీ సెటిల్మెంట్స్ చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి కొంత మంది అధికారులు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు అని ఐఏఎస్ సర్కిల్స్ లో కూడా ప్రచారం జరుగుతోంది.