ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలతో రికార్డు

Update: 2024-08-23 05:24 GMT
ఒకే రోజు  13,326 పంచాయతీల్లో గ్రామ సభలతో  రికార్డు
  • whatsapp icon

తెలుగు రాష్ట్రాల్లో గ్రామ సభల ఏర్పాటు మర్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో ఎవరికీ తెలియదు. వాతావనికి గ్రామాల్లో చేపట్టే కొన్ని పనుల ఆమోదానికి ఇవి తప్పని సరి అయినా కూడా వ్యవహారం అంతా కాగితాల మీదే నడిచిపోతోంది. గ్రామ సభలు జరిగినట్లు..సంబంధిత పనుల ఆమోదం పొందినట్లు రాసుకుని పనులు చేసుకుంటారు. ఇది అంతా ప్రధానంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే...ఆ పార్టీ ప్రభుత్వంలోని నాయకుల ఇష్టానుసారం సాగిపోతుంది. చాలా సార్లు అసలు గ్రామ సభ ఆమోదం పొందిన పనులు...దీనికి పెట్టిన ఖర్చు వంటి వివరాలు కూడా చిరవకు ఆ గ్రామ ప్రజలకు నామమాత్రంగా కూడా తెలియవు. ఈ పరిస్థితులు వచ్చి చాలా కాలమే అయింది. ఇలాంటి తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కొత్త రికార్డు నెలకొల్పారు.

                                                                                    ఒక రోజు..ఒకే సారి ఆంధ్ర ప్రదేశ్ లో 13,326 పంచాయతీల్లో గ్రామ సభల ఏర్పాటు కు నిర్ణయం తీసుకుని అమలు చేశారు. శుక్రవారం నాడు అంటే...ఆగస్ట్ 23 న ఆంధ్ర ప్రదేశ్ ఈ సంచలన కార్యక్రమానికి వేదికైంది. గ్రామ సభల నిర్వహణతో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా ఏకంగా 4,500 కోట్ల రూపాయల నిధులతో, 87 రకాల పనులకు ఈ సభల ద్వారా ఆమోదం పొందనున్నారు. ఒకే సారి ఇంత పెద్ద మొత్తంలో గ్రామ సభల ఏర్పాటు దేశంలోనే ఒక రికార్డు అని పంచాయతీరాజ్ అధికారులు చెపుతున్నారు. కొత్తగా ఆమోదం పొందనున్న పనులతో తొమ్మిది కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన అవకాశం దక్కుతుంది అని వెల్లడించారు.

                                                                                         ఇటీవల మీడియా తో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గ్రామాలకు వచ్చే ఆదాయం పెంచే ఏర్పాట్లు చేయటంతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఒకే రోజు రికార్డు స్థాయిలో 13,326 పంచాయతీల్లో గ్రామ సభల ఏర్పాటు ద్వారా ఈ శాఖ బాధ్యతలు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఈ శాఖలో తన మార్క్ చూపించినట్లు అయింది అనే చర్చ సాగుతోంది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తొందరపాటు నిర్ణయాలు కాకుండా పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే శాఖ అధికారులతో సుదీర్ఘ కసరత్తు చేసి...ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మైసూరివారిపల్లెలో నిర్వహించించిన గ్రామ సభలో పాల్గొన్నారు. 

Tags:    

Similar News