పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్

Update: 2021-04-16 11:27 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజుల క్రితం ఆయన టీమ్ లోని కీలక వ్యక్తులకు పాజిటివ్ రావటంతో ఆయన క్వారంటైన్ లో ఉన్నారు. తాజాగా జరిపినన టెస్ట్ ల్లో పవన్ కళ్యాణ్ కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనకు నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో  చికిత్స జరుగుతోందని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతుండటంతో పవన్ కళ్యాణ్ మరోసారి కోవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్ అని తేలింది. ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ళ సుమన్ హైదరాబాద్ కు వచ్చి పవన్ కళ్యాణ్ కి చికిత్స ప్రారంభించారు.

అవసరమైన ఇతర పరీక్షలన్నీ చేయించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు. అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి పవన్ కళ్యాణ్ ని పరీక్షించింది. అపోలో ఆస్పత్రికి చెందిన డాక్టర్ శ్యామ్, డాక్టర్ సుబ్బారెడ్డి -  పవన్ కళ్యాణ్  ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. జ్వరం ఊపిరితిత్తుల్లోని నిమ్ము, ఒళ్లునొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Tags:    

Similar News