ఇలా అయితే రాజకీయంగా కష్టమే!

Update: 2026-05-26 04:51 GMT

నన్ను ప్రశ్నించొద్దు...ఫాలో కండి అంతే. ఇష్టం లేకపోతే బయటకు వెళ్లిపోండి. ఎవరైనా పార్టీ లైన్ లో ఉండాలి..లేదు అంటే ఆ లైన్ ధాటి బయటకి వెళ్ళిపోవాలి. ఇవీ జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు. ఒకప్పుడు ప్రశ్నించటానికే పార్టీ పెట్టా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ మాత్రం ప్రశ్నలు స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించటం లేదు. అది కూడా సొంత పార్టీ నేతలు...క్యాడర్ నుంచే. పైగా పవన్ కళ్యాణ్ తాజాగా చేసినా వ్యాఖ్యలు తనను తప్ప ...ఎవరినైనా ప్రశ్నించండి అన్నట్లు ఉన్నాయి. నా మాటే శాసనం...పార్టీలో అంతా నా ఇష్టం అన్నట్లు ప్రకటించారు. సహజంగా ఏ ప్రాంతీయ పార్టీలో అయినా ఇదే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఎవరూ ఈ విషయాన్ని ఇలా చెప్పరు. పవన్ కళ్యాణ్ లాగా ఇలా చెపితే అది ఆ రాజకీయ పార్టీకి నష్టం కూడా. ఏ మాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా...కేవలం తాను చెప్పింది వినండి..లేదు అంటే బయటకు పోండి అని బహిరంగంగా ఒక పార్టీ అధినేత చెప్పటం అంటే పార్టీ పై పవన్ కళ్యాణ్ కు కంట్రోల్ లేకుండా పోతుందా...అయన ఎందుకింద ఫ్రస్టేషన్ తో మాట్లాడారు అన్న చర్చ సాగుతోంది.

                                     రాజ్య సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన తరుణంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జాతీయ పార్టీ కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం పాలు ఎక్కువ. పార్టీలో ఉంటూనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ని కూడా విమర్శించవచ్చు. బీజేపీ లో అలాంటి ఛాయలు ఎక్కడా కనపడవు. అయినా సరే అంతా అక్కడ కామ్ గా సాగిపోతుంది. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న తెలుగు దేశం పార్టీలో కూడా అసమ్మతి స్వరాలు ఉన్నాయి. నాయకుల మధ్య విబేధాలు కూడా ఎన్నో. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని సార్లు హెచ్చరికలు జారీ చేసినా కూడా లైన్ లోకి రాని నేతలు కొంత మంది ఉంటారు. అలాంటి నేతలకు ఎన్నికల సమయంలో టిక్కెట్లు ఇవ్వకుండా షాక్ లు ఇస్తుంటారు.

                                        Full Viewపార్టీ అధినేత ఎంత పవర్ ఫుల్ లీడర్ అయినా...ఎంత గ్లామర్ ఉన్నా కూడా అది ఓటు బ్యాంకు గా మారాలి అంటే స్థానిక నాయకత్వం తో పాటు క్యాడర్ కూడా అంతే బలంగా ఉండాలి. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఎవరైనా సరే తన మాట వినాలి ...లేదు అంటే బయటకు వెళ్ళిపోవాలి అంటే ఇప్పటికి అయితే అంతా బాగానే ఉంటుంది. పార్టీ నాయకులకు...క్యాడర్ కు కనెక్షన్ కట్ అయితే ఆ ప్రభావం ఎలా ఉంటుంది అన్నది ఎన్నికల సమయంలోనే బయటపడుతుంది. ఎన్నికల సమయంలో కార్యాకర్తలే తమకు దైవసమానులు అని చెప్పి...అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళను పూర్తి గా విస్మరించి వ్యవహరించిన తెలుగు దేశం పార్టీ కూడా ఎన్నో సార్లు రాజకీయంగా దారుణ ఫలితాన్ని చవిచూసింది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే రాబోయే కాలంలో జనసేన పరిస్థితి ఎలా ఉండబోతుందో స్పష్టంగా కనిపిస్తోంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Tags:    

Similar News