ముందు నుంచి ప్రచారం జరిగినట్లు జనసేన రాజ్య సభ సీటు పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కే దక్కింది. మధ్యలో మరో పారిశ్రామికవేత్త బండారు నరసింహ రావు తో పాటు మరి కొంత మంది జనసేన కు దక్కే సీటు కోసం తమ వంతు ప్రయత్నాలు చేశారు. కానీ జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం రమేష్ వైపే మొగ్గుచూపారు. శుక్రవారం రాత్రి అధికారికంగా రమేష్ పేరును ప్రకటించారు. దీంతో జనసేన రాజ్య సభ సీటు విషయంలో సస్పెన్సు వీడినట్లు అయింది అనే చెప్పొచ్చు. జనసేన పార్టీతో, పవన్ కళ్యాణ్ తో 2015 నుంచి రమేష్ కి అనుబంధం ఉంది అని, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అన్ని సామాజిక వర్గాల మధ్య సఖ్యత... అందుకు తగ్గ సోషల్ ఇంజినీరింగ్ అవసరమనే పవన్ కళ్యాణ్ ఆలోచనలకు ఆకర్షితులై ఆయన వెన్నంటి ఉన్నారు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
శనివారం మధ్యాహ్నం రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేస్తారు అని జనసేన వెల్లడించింది. 2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా జనసేన సిద్ధాంతాలపైనా, పార్టీ అధ్యక్షుడుగా పవన్ కళ్యాణ్ పైనా విశ్వాసం కనపరచి- ఎన్ని ఒత్తిళ్ళు, సవాళ్ళు ఎదురైనా సహనంతో నిలిచిన వారికి నామినేటెడ్ పదవుల్లో కుల, మతాలు పరిగణనలోకి తీసుకోకుండా అవకాశం కల్పించారు. ఇదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికలోనూ పవన్ కళ్యాణ్ పరిగణనలోకి తీసుకున్నారు అని జనసేన వెల్లడించింది. జనసేన కు దక్కిన ఫస్ట్ సీటు ను పవన్ కళ్యాణ్ ఇప్పుడు పారిశ్రామిక వేత్త కు కేటాయించటం ప్రాధాన్యత సంతరించుకుంది.