జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. అదే సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని కోరారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మేరకు అమిత్ షాకు ఓ వినతిపత్రం అందజేశారు. ఈ భేటీలో జనసేన పీఏసీ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంతోపాటు ఏపీలో రాజకీయ పరిస్థితులపై కూడా వీరి భేటీలో చర్చకు వచ్చాయి. ముఖ్యంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం.