జగన్ కాంట్రిబ్యూషన్ మర్చిపోతే ఎలా!

Update: 2025-03-15 06:53 GMT
జగన్ కాంట్రిబ్యూషన్ మర్చిపోతే ఎలా!
  • whatsapp icon

పోటీ చేసిన ప్రతి చోటా గెలవాలంటే ఆ రాజకీయ పార్టీ కి ఎంత బలం ఉండాలి. కేవలం ఏడు అంటే ఏడు శాతం ఓటు బ్యాంకు ఉన్న జనసేన 2024 ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది అంటే అది మొత్తం ఆ పార్టీ సొంత బలమా? అలా అని చెపితే ఎవరైనా నమ్ముతారా?. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక లెక్కల ప్రకారమే 2019 ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లు ఏడు శాతం లోపే. పోనీ జనసేన 2024 ఎన్నికల వరకు ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసింది కాబట్టి ఆ పార్టీ ఓటు బ్యాంకు పది శాతం వరకు పెరిగింది అనుకుందాం. అయినా కూడా పది శాతం ఓటు బ్యాంకు తో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధ్యం అవుతుందా? అంటే కచ్చితంగా కాదు అనే చెప్పొచ్చు. కానీ జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి జనసేన నేతలు పదే పదే వంద శాతం స్ట్రైక్ రేట్ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అంతే కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు పిఠాపురం లో జరిగిన జనసేన జయకేతనం సభలో మాట్లాడుతూ ఓడిపోయినా నిలబడి గెలవటంతో పాటు నలభై ఏళ్ల పార్టీ ని కూడా నిలబెట్టాను అని వ్యాఖ్యానించటం టీడీపీ నేతలు, క్యాడర్ లో దుమారం రేపుతోంది.

                                                      దీనిపై అధికారికంగా పార్టీ స్పందించకపోయినా సోషల్ మీడియా లో మాత్రం టీడీపీ అభిమానులు మాత్రం జనసేన తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఓడినా నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీ ని ఏడు శాతం ఓటు బ్యాంకు కూడా లేని పార్టీ నిలబెట్టిందా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పేరిట..జనసేన పేరిట వంద శాతం స్ట్రైక్ రేట్ రికార్డు నమోదు అయింది. దీన్ని ఎవరూ కాదనలేరు కూడా. అయితే ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ అవసరానికి మించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం...చంద్రబాబు అరెస్ట్ తో పాటు ఎన్నో అంశాలతో రెండు పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ ఫర్ పర్ఫెక్ట్ గా జరగటం వల్లే కూటమి ఈ సంచలన విజయాన్ని దక్కించుకుంది. జనసేన 21 సీట్లు గెలిస్తే ...టీడీపీ 135 సీట్లు దక్కించుకుంది. మొన్నటి ఎన్నికల్లో కూటమి గెలుపు లో పొత్తు ఎంత కీలకంగా మారిందో అంత కంటే ఎక్కువే జగన్ సర్కారుపై వ్యతిరేకత పని చేసింది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.

                                                     అంతే కానీ చంద్రబాబు హామీల అమలు ..పరిపాలనా దక్షత వంటి అంశాల ఆధారంగానే రాష్ట్ర ప్రజలు కూటమికి ఓటు వేశారు అనుకుంటే అంతకు మించిన మోసం మరొకటి ఉండదు అనే చెప్పొచ్చు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మరో ప్రత్యామ్నాయం లేక కూటమి వైపు మొగ్గుచూపారు తప్ప...ఏదో అద్భుతాలు చేస్తారు అని ఎవరూ నమ్మలేదు అనే విషయం చాలా మందికి తెలుసు. జగన్ తో పోలిస్తే కచ్చితంగా చంద్రబాబు ఎంతో కొంత బెటర్ గా పాలన అందిస్తారు అనే అభిప్రాయం ఉండటం మొన్నటి ఎన్నికల్లో కలిసి వచ్చింది. మాటలు మార్చటంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు కు ఏ మాత్రం తీసిపోరు అనే సంగతి ప్రజలంతా గతంలోనే చూశారు . రాజధాని అమరావతి తో పాటు ప్రత్యేక హోదా, బీజేపీ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఎన్ని పిల్లిమొగ్గలు వేశారో అందరికి తెలుసు. కానీ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు సీఎం సీటు లో ఉన్నారు అంటే అది తమ వల్ల..తమ పార్టీ వల్లే అని చెపుతుండటం టీడీపీ క్యాడర్ ను షాక్ కు గురి చేస్తోంది. అధికారం తప్ప మరో విషయం గురించి ఆలోచించని చంద్రబాబు తాజాగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లు టీడీపీ పై చేసిన వ్యాఖ్యలపై మాట్లాడకపోవచ్చు. కానీ భవిష్యత్ లో జరిగే ఏ ఎన్నికల్లో అయినా ఇలాంటి వాతావరణంలో జనసేన కు టీడీపీ క్యాడర్ ఏ మాత్రం మద్దతు గా నిలబడదు అనే చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. ఈ విషయంలో అప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు మాట్లాడినా పెద్ద ఉప యోగం ఉండదు అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News