జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదే పదే పోలీస్ లపై విమర్శలు చేస్తున్నా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరెత్తి మాట్లాడం లేదు. పైగా హోమ్ మంత్రి అనిత తో పాటు మరో మంత్రి నారాయణ లాంటి వారు కూడా కూటమిలో ఇలాంటి ఇష్యూలు మాములే అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తేలికపర్చే పనిలో ఉన్నారు. సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు కూడా ఇదే ట్రెండ్ ను కొనసాగించారు. మంగళవారం నాడు సరస్వతి పవర్ ప్లాంట్ భూములను పరిశీలించిన అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. ‘పోలీస్ ఉన్నతాధికారులు సైతం మెత్తబడిపోయారు. లేకుంటే వాళ్ళు కూడా భయపడుతున్నారా?. స్థానిక యువతను గత ప్రభుత్వంలోని వారు భయపెడితే ఊరుకుంటారా? పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు వేసి బెదిరిస్తుంటే ఏం చేస్తున్నారు.
ప్రజలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులది కాదా? రౌడీయిజాన్ని అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదే. వైసీపీ నాయకులు ఇంకా తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. శాంతి భద్రతలు అంటే ఎంత బలంగా ఉంటాయో వాళ్లకు చూపించాలి. ’ అంటూ పోలీస్ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. పవన్ కళ్యాణ్ మాటలు చూసిన వాళ్ళు అంతా కూటమి ప్రభుత్వానికి ఏమి చేతకావటం లేదు అన్నట్లు ఆయన మాటలు ఉన్నాయని..పైగా ఇంకా వైసీపీ నాయకులు ఇంకా తమ ప్రభుత్వమే ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు అంటూ మాట్లాడితే అది ఎవరి చేతకాని తనం అవుతుంది అన్న ప్రశ్న ఉదయించదా అన్న సందేహాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తెలిసి మాట్లాడుతున్నారో ..లేక తెలియక మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదు అని టీడీపీ నేతలు తలపట్టుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఏమి కాకపోయినా ఇది భవిష్యత్ లో టీడీపీ కి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు పోలీస్ మెత్తబడి పోయారు అని విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి నిబంధనలకు విరుద్ధంగా కారు పైకి ఎక్కి కూర్చోవటం ఏమిటో అర్ధం కావటం లేదు అని...ఇది మోటార్ వాహనాల చట్టం ప్రకారం సరికాదు అని ఒక అధికారి వెల్లడించారు. గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తే ఆయన ప్రభుత్వం అంటే అంతా సినిమాల్లో ఉన్నట్లే ఉంటుంది అనుకున్నట్లు ఉన్నారు అని ఒక ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మోడల్ ఫాలో అవ్వాలని చెపుతున్న పవన్ కళ్యాణ్ లాగా మోడీ క్యాబినెట్ లో ఎవరైనా మాట్లాడితే వెంటనే ఇంటికి పంపిస్తారు అన్నారు.