పవన్ కళ్యాణ్ ఇక వరసగా సీట్ల ప్రకటనలు చేస్తారా?

Update: 2023-08-02 08:48 GMT

Full Viewజనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతం బీజేపీ తో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల నాటికీ టీడీపీ తో కలిసి ముందుకు సాగుతారు అని ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల నాటికి ఏ రెండు పార్టీలు అంటే టీడీపీ, జనసేనలు కలిసి ఉంటాయా..లేక బీజేపీ, జనసేన లు మాత్రమే ముందుకు సాగుతాయా?..లేక ముగ్గురూ ఒకటి అవుతారా అన్న విషయం తేలటానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో జనసేన బరిలో నిలిచే నియోజకవర్గాలు కూడా ఇప్పటివరకు పెద్దగా క్లారిటీ ఉన్న దాఖలాలు అయితే లేవనే చెప్పాలి. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తెనాలి సీటు తమదే అని...గెలుపు కూడా మాదే అంటూ ప్రకటించటం విశేషం. ఈ లెక్కన జనసేన తరపున ప్రకటించిన తొలి సీటు ఇదే అని చెప్పుకోవాలి.

గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసి పరాజయం పాలు అయిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అక్కడే మరో సారి పోటీ చేయనున్నారు. మంగళవారం నాడు తెనాలి నియోజకవర్గ నేతలతో సమావేశం అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెనాలి లో జనసేన జెండా ఎగురుతుంది అని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనోహర్ ను గెలిపించటం ఎంతో అవసరం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పొత్తులో సీటు దక్కే ఛాన్స్ లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ సీటు ప్రకటన ఒక్క తెనాలి తో ఆగుతుందా..లేక రాబోయే రోజుల్లో వరసగా ప్రకటించుకుంటూ పోతారా అన్నది చూడాలి.

Tags:    

Similar News