పాపికొండ‌ల టూరిజం బోట్లు ప్రారంభం

Update: 2021-07-01 15:50 GMT

తొలిసారి ఈ ప్రాంతాన్ని చూస్తే అస‌లు తెలుగు రాష్ట్రాల్లో ఇంత అద్భుత‌మైన ప్రాంతం ఉందా అని ఆశ్చ‌ర్య‌పోతార‌న‌టంలో ఎలాంటి సందేహం లేదు. గోదావ‌రి న‌దికి ఇరువైపులా ఉండే కొండ‌ల‌ను చూస్తూ బోట్ లో అలా విహ‌రిస్తూ ఆ అనుభూతే వేరు. విదేశాల్లో ఉండే ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు ఏ మాత్రం తీసిపోని రీతిలో పాపికొండ‌లు ప్రాంతం ఉంటుంది. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో గత 21 నెలలు గా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర తిరిగి ప్రారంభమైంది. గోదావరి నదికి హారతి ఇచ్చి పాపికొండల విహారయాత్ర ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ గురువారం నాడు ప్రారంభించారు.

పాపికొండల విహారయాత్రకు వెళ్లే టూరిజం బోట్ల ట్రయిల్ రన్‌లో మంత్రి అవంతి పాల్గొన్నారు. కచ్చులూరు దుర్ఘటన, కొవిడ్ పరిస్థితుల కారణంగా పాపికొండల టూరిజం 21 నెలలుగా నిలిపి వేసినట్లు మంత్రి తెలిపారు. శుక్ర‌వారం నుంచి పాపికొండల బోటింగ్‌కు బుకింగ్స్ ప్రారంభం అవుతాయని చెప్పారు. ఏపీలో కూడా క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో ఎనిమిది జిల్లాల్లో క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించారు. దీంతో క్ర‌మంగా పాపికొండ‌ల టూరిజం మ‌ళ్లీ ఊపందుకునే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News