పాపికొండల అందాల వీక్షణ మళ్ళీ అందుబాటులోకి వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ప్రాంతంలో పర్యాటకుల బోట్లు కదిలాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పాపికొండలు ఒకటనే విషయం తెలిసిందే. ఇక్కడ గోదావరిలో లాహిరి లాహిరి అంటూ పాపికొండల అందాలను చూసేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తిచూపిస్తారు. ఈ ప్రాంతంలో కచ్చలూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదంతో రెండేళ్ళ నుంచి బోటింగ్ సర్వీసులు నిలిచిపోయాయి. పలు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత సర్కారు రెండేళ్ల అనంతరం ఆదివారం నుంచి పాపికొండల బోట్ యాత్రలకు అనుమతి మంజూరు చేసింది. దీంతో పర్యాటకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నాడు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు పాపికొండల బోట్లను ప్రారంభించారు. గండిపోశమ్మ ఆలయం నుంచి పాపికొండల విహారయాత్రకు రెండు బోట్లు బయలుదేరాయి. అయితే గతంతో పోలిస్తే పర్యాటకు ల నుంచి వసూలు చేసే ఛార్జీలు మాత్రం గణనీయంగా పెరిగాయి.
టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు, టూరిజం, ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది సహకరిస్తారని మంత్రి అవంతి తెలిపారు. జీపీఎస్.. సాటిలైట్ సిస్టంతో.. చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రయాణికులు అందరూ లైఫ్ జాకెట్స్ ధరించి టూరిజం సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఏ విధంగా సీట్ బెల్ట్ పెట్టుకుంటారో బోట్ ఎక్కి..దిగే వరకు కూడా అదే విధంగా ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం 11 బొట్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని, మిగిలిన బొట్లకు త్వరలోనే పర్మిషన్ ఇస్తామన్నారు.గతంలో జరిగిన ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి బోట్ బయలుదేరే ముందు గజ ఈతగాళ్లు పైలబ్ బోట్ లో ముందు ప్రయాణించి..మార్గమధ్యంలో ఏమైనా అవాంతరాలు..ఇబ్బందులు ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలించి బోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.