ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన క్రీడాకారిణి పీ వీ సింధు శుక్రవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె తాను సాధించిన పతకాన్ని సీఎం జగన్ కు చూపించారు. వరసగా రెండు ఒలంపిక్స్ లో పతకం సాధించిన సింధును అభినందించిన జగన్ విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలన్నారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారు కావాలని జగన్ ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదును అధికారులు అందించారు. ప్రభుత్వం తరపున అందిస్తున్న ప్రోత్సహకానికి సింధు ధన్యవాదాలు తెలిపారు.
అంతకు ముందు పీవీ సింధు విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలునిర్వహించారు. ఆలయ అధికారులు సింధు, ఆమె కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ ఒలంపిక్స్ కు వెళ్ళే ముందు అమ్మవారిని దర్శించుకున్నానని..ఆమె ఆశీర్వాదంతో పతకం గెలుచుకున్నట్లు వ్యాఖ్యానించారు. 2024 ఒలంపిక్స్ తోపాటు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో టోర్నమెంట్స్ ఆడాల్సి ఉందని తెలిపారు.