అయినా నోరు తెరిచి మాట్లాడని నేతలు
భారీ రాయితీలు ఇచ్చినా టాటా పవర్ జంప్
వైజాగ్ లో వెయ్యి కోట్ల 22 ఎకరాల భూమి భూమి 99 పైసలకే
ఆంధ్ర ప్రదేశ్ కు దక్కిన ప్రతిష్టాత్మక టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్టును ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం తరలించుకుపోయింది. 6675 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు లో టాటా పవర్ 10 గిగావాట్స్ సామర్థ్యంతో ఇంగోట్స్ అండ్ వేఫర్ ప్రాజెక్ట్ తలపెట్టింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఏపీ సర్కారు 2026 జనవరి పదవ తేదీన పలు రాయితీలు ఇస్తూ కూడా జీవో 11 జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని రీతిలో ఐటి సంస్థలతో పాటు పలు కంపెనీలకు రాయితీలు..ప్రోత్సహకాలు ఇస్తూ తమ గొప్పతనంతో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించినట్లు చెప్పుకుంటోంది. ఆంధ్ర ప్రదేశ్ కు దక్కిన టాటా గ్రూపుకు చెందిన 6675 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇప్పుడు ఒడిశాకు తరలి వెళ్ళటం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లకు బిగ్ షాక్ అనే చెప్పాలి.
ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే వైజాగ్ లో ఇదే టాటా గ్రూప్ కు చెందిన దిగ్గజ ఐటి కంపెనీ టిసిఎస్ కు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే 22 ఎకరాల భూమిని ఏపీ సర్కారు 99 పైసలకే కేటాయించింది. అంతే కాదు టాటా పవర్ కు కూడా భారీ ఎత్తున రాయితీలు ఇవ్వటానికి వీలుగా జీవో కూడా జారీచేసినా కంపెనీ ఒడిశా కు వెళ్ళటం వెనక ప్రధాన కారణం రాజకీయ ఒత్తిళ్లు అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. లేక పోతే టాటా గ్రూప్ కు చెందిన ఒక కంపెనీ అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇలా చేసే అవకాశం ఉండదు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. గతంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఈ సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం నెల్లూరు జిల్లాలోని ఇఫ్కో సెజ్ లో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఇంగోట్స్ అండ్ వేఫర్ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ ఇంగోట్స్ అండ్ వేఫర్ లు సెమికండక్టర్స్, సోలార్ సెల్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వెయ్యి మంది ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వంలో గతంలో ప్రకటించింది. టాటా పవర్ 10 గిగావాట్స్ సామర్థ్యంతో ఈ యూనిట్ ఏర్పాటు చేస్తుంది అని వెల్లడించారు. ప్రముఖ ఆంగ్ల బిజినెస్ పత్రిక ఎకనామిక్ టైమ్స్ ఒడిశా ఎక్కువ రాయితీలు ఇస్తున్నందునే కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఆ రాష్ట్రానికి వెళ్ళిపోయింది అని రాసింది.
కంపెనీ అధికారికంగా ఈ విషయం వెల్లడించింది. అయితే తెరవెనక కారణం మాత్రం రాజకీయ ఒత్తిళ్లు అని ఏపీ అధికారులు చెపుతున్నారు. టీడీపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నా కూడా ఆంధ్ర ప్రదేశ్ కు దక్కిన ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను మరో బీజేపీ పాలిత రాష్ట్రం తీసుకెళ్లటం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. విచిత్రం ఏమిటి అంటే ఇంత జరిగినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు ఈ విషయంపై పెదవి విప్పటం లేదు. ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి లో జారీ చేసిన జీవో ప్రకారం స్థిర మూలధన పెట్టుబడిపై 38.4 శాతం మేర పెట్టుబడి సబ్సిడీ, గరిష్ఠంగా రూ. 2,225.8 కోట్లు వరకు ఇవ్వటానికి ఓకే చేశారు. ఈ సబ్సిడీని కంపెనీ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం అయినప్పటి నుంచి 5 సంవత్సరాల పాటు విడతల వారీగా చెల్లించటానికి అంగీకరించారు. అంటే స్థిర మూలధన పెట్టుబడి 5,800 కోట్ల రూపాయల్లో 2225 కోట్లు వెనక్కి ఇవ్వటానికి అంగీకరించారు. అంతే కాకుండా 10 సంవత్సరాల పాటు యూనిట్‌కు రూ. 1.50 చొప్పున విద్యుత్ టారిఫ్ రీయింబర్స్‌మెంట్ కు ఆమోదించారు. వీటితో పాటు ఇంకా ఎన్నో రాయితీలు ఉన్నాయి. అయినా సరే టాటా పవర్ ఏపీని కాదని ఒడిశా కు వెళ్ళింది.