ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి శాసనమండలిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకించి ఇప్పుడు మండలి రద్దు తీర్మానం జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీకి మండలిలో మెజారిటీ రావడం ఆనందంగా ఉందని అన్నారు. సోమవారం నాడు వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతోమాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పదవుల్లో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు.
ముగ్గురు మైనారిటీలకు మండలిలో అవకాశం కల్పించాం. మొదటి నియామకం బీసీ సభ్యులతో ప్రారంభించాం. అన్ని నియామకాల్లో ఎస్సీ, బీసీ, మైనారిటీలకే ప్రాధాన్యత ఉంటుందన్నారు. నలుగురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్‌రాజు, రమేష్ యాదవ్‌లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు.