తెలంగాణ, ఏపీల మధ్య జల జగడం రావటానికి కారణం రాయలసీమ ఎత్తిపోతల. ఇది రెండు రాష్ట్రాల మధ్య పెద్ద వివాదం అయి కూర్చుంది. ఇప్పటివరకూ రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న రాయలసీమ ప్రాజెక్టుపై ఇప్పుడు ఏపీలోనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వెనకబడిన ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆదివారం నాడు లేఖ రాశారు. ఇది కొత్త వివాదంగా మారే అవకాశం ఉంది. రాయలసీమ ఎత్తిపోతల వల్ల పూర్తిగా వర్షాలు, నాగార్జునసాగర్ కాలువలపై ఆధారపడిన ప్రకాశం జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని..ఇది సరికాదంటూ లేఖ రాశారు. ఈ లేఖ రాసిన వారిలో ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, బాలవీరాంజనేయ స్వామి, సాంబశివరావు ఉన్నారు.
పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40 నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంపుపై వీరు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ, సీమ ఎత్తిపోతల వల్ల ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందని, పంట భూములన్నీ భూగర్భజలాలు, సాగర్‌పైనే ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలతో మరింత చేటు జరిగేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం నిండకుండా ప్రాజెక్టులు కడితే తమ పరిస్థితేంటి? ఏమిటని ప్రశ్నించారు. గుంటూరు ఛానల్ ను దగ్గుబాడు వరకు పొడిగించాలని ఆ లేఖలో కోరారు. కరువు జిల్లా గొంతు కోయవద్దని వేడుకుంటున్నామని పేర్కొన్నారు.