
ఆంధ్ర ప్రదేశ్ లో బుధవారం నాడు కీలక పరిణామం చోటు చేసుకుంది. చూడటానికి అది అంత పెద్ద విషయమా అనే వాళ్ళు ఉండొచ్చు ఏమో కానీ...అసలు ఎజెండా చూస్తే మాత్రం అది ఎంత పెద్ద విషయమో తెలుసుంది. ఇప్పటికే టీడీపీ లో...ఏపీ ప్రభుత్వంలో నారా లోకేష్ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు అనే విషయం అందరికి తెలిసిందే. రెండు చోట్ల అంటే అటు పార్టీలో..ఇటు ప్రభుత్వంలో ఆయన పట్టు బిగిస్తున్నారు అనే చర్చ టీడీపీ నేతల్లో కూడా ఉంది. లోకేష్ కు తెలియకుండా అటు ప్రభుత్వంలో..పార్టీ లో ఏమీ జరగదు అనే ప్రచారం కూడా గత కొన్ని రోజులుగా విస్తృతంగా సాగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలో ఎంత పెద్ద దిగ్గజ సంస్థో అందరికి తెలిసిందే. మొదటి నుంచి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి...రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే జగన్ హయాంలో ఎవరూ ఊహించని రీతిలో ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడు అయిన పరిమళ్ నత్వానికి వైసీపీ తరపున ఏకంగా రాజ్య సభ సభ్యత్వం కూడా ఇప్పించుకున్నారు. బడా బడా పారిశ్రామిక వేత్తలు అందరూ ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు సన్నిహితంగా ఉంటారు అనే విషయం అందరికి తెలిసిందే.
అయితే బుధవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ కు ఆంధ్ర ప్రదేశ్ ఐటి, మానవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ శంఖుస్థాపన చేశారు. సహజంగా అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీ యూనిట్ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు అవుతారు. పోనీ ఇది నారా లోకేష్ నిర్వహిస్తున్న శాఖా అంటే అదీ కాదు. అయినా సరే నారా లోకేష్ ను చంద్రబాబు ఈ ప్లాంట్ శంకుస్థాపనకు పంపారు. ఇందులో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా పాల్గొన్నారు. అంటే ప్రభుత్వంలో నారా లోకేష్ కు లైన్ క్లియర్ చేయటం తో పాటు ఫ్యూచర్ సీఎం నారా లోకేష్ అనే సంకేతాలు అటు పారిశ్రామిక వర్గాలతో పాటు అందరికి పంపే ప్రయత్నం చేస్తున్నారు అనే చర్చ సాగుతోంది. ఈ తరుణంలో ఇదే వేదిక నుంచి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ఫ్యూచర్ సీఎం నారా లోకేషే అన్నారు.
తాను అడగటం వల్ల ఈ ప్లాంట్ రాలేదు అని...లోకేష్ మనకు ఈ రిలయన్స్ యూనిట్ ఇచ్చారు అని చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ కొంత మంది టీడీపీ నేతలు బహిరంగంగా డిమాండ్ చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇది అప్పటిలో రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఎందుకంటే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ టీడీపీ నేతల డిమాండ్ పై కొంత మంది జన సేన నాయకులు ఘాటు విమర్శలు కూడా చేశారు. తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగి పోయింది. ఇప్పుడు ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహ రెడ్డి ఫ్యూచర్ సీఎం నారా లోకేషే అని చెప్పటం హాట్ టాపిక్ మారితే..ఫస్ట్ టైం సీఎం కాకుండా రిలయన్స్ వంటి కంపెనీ యూనిట్ శంఖుస్థాపన నారా లోకేష్ తో చేయించటం అన్నది కూడా కీలక పరిణామంగా అధికార, రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నేరుగా ఏమీ చెప్పకపోయినా చంద్రబాబు ఒక ప్లాన్ ప్రకారం తాను అనుకున్న పని చేస్తారు అనే సంగతి తెలిసిందే.