ఏపీ ఐటి, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టిలో మంత్రులంతా డమ్మీలేనా?!. ఆయన ఒక్క జూమ్ కాల్ చేస్తే చాలు రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చిపడతాయా?. ఇదే నిజం అయితే నెలకు నారా లోకేష్ ఎన్ని జూమ్ కాల్స్ చేయవచ్చు...రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు సాధించవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో పరిశ్రమల శాఖ మంత్రి టి. జి. భరత్ దగ్గర ఉంది. ఆయన కూడా యువ నాయకుడు..విద్యావంతుడు. కానీ గత కొన్ని రోజులుగా నారా లోకేష్ అసలు పరిశ్రమల శాఖ మంత్రి టి. జి. భరత్ ను పూర్తిగా విస్మరించి తానే ఒక్క జూమ్ కాల్ తో రాష్ట్రానికి ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ జాయింగ్ వెంచర్ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చినట్లు టీడీపీ అధికారికగా పేస్ బుక్ పేజీ లో ప్రచారం చేసుకుంటున్నారు. ఈ లెక్కన పరిశ్రమల శాఖ మంత్రి లేరు...ఎవరూ లేరు. ప్రభుత్వం అంటే చంద్రబాబు, నారా లోకేష్ అన్నట్లు వ్యవహరించటం క్యాబినెట్ మంత్రులతో పాటు అధికార వర్గాల్లో కూడా చర్చకు కారణం అవుతోంది. లోకేష్ ప్రచారం చేసుకుంటున్నట్లు ఒక్క జూమ్ కాల్ తో రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు వచ్చేటట్లు అయితే ఇంత కంటే గొప్పగా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అని...రాష్ట్రంలో అందుబాటులో ఉన్న భూమి...ప్రతిపాదిత యూనిట్ కు కేటాయించే భూమికి దగ్గరలోనే ఓడరేవు లు ఉండటం ఆ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ వైపు మొగ్గుచూపటానికి ప్రధాన కారణం.
ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధులు కూడా చెపుతున్నారు. వీటితోపాటు ఆ కంపెనీకి ఇచ్చే రాయితీలు ఏంటి అన్నది కూడా రాబోయే రోజుల్లో కానీ తేలదు. నారా లోకేష్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా మాట్లాడటాన్ని ఎవరూ తప్పుపట్టారు. కానీ పరిశ్రమల శాఖ మంత్రి గా ఒకరు ఉన్నారు అన్న విషయాన్ని విస్మరించి సొంత ప్రచారం...తమ ప్రభుత్వంలోని మంత్రిని కూడా విస్మరించి అంతా నేనే నేనే అన్నట్లు చెప్పుకోవటంతో తమకు తప్ప ఎవరికీ ఏమి చేతకాదు అనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. జగన్ గత ప్రభుత్వంలో ఇలా చేస్తేనే ఏమైందో అందరూ చూశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు, నారా లోకేష్ లు మాత్రం తమ వల్లే అధికారంలోకి వచ్చాం అన్నట్లు వ్యవహరిస్తుండటం మంత్రుల ఆగ్రహానికి కారణం అవుతోంది. చాలా మంది సీనియర్లను పక్కనపెట్టి ఎక్కువ మందికి కొత్త వాళ్లకు క్యాబినెట్ లో ఛాన్సులు ఇవ్వటం వెనక ఎజెండా కూడా ఇదే అని చెపుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ భారీ ఎత్తున పెట్టుబడులు సాదించాలి..రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందే. కానీ ఇతర మంత్రులను అసలు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేవలం నారా లోకేష్ ఒక్కరే అంతా చేస్తున్నారు అన్న కలరింగ్ ఇవ్వడంతోనే సమస్య వస్తుంది అని ఒక సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే నారా లోకేష్ వారం రోజుల పాటు పెట్టుబడుల సాధన కోసం అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చినందుకు మంత్రులు బుధవారం నాడు ఆయనకు అభినందనలు తెలిపారు. అయితే ఇందులో కూటమి భాగస్వామి పార్టీలు అయిన జనసేన, బీజేపీ కి చెందిన మంత్రులు మాత్రం లేదు. లోకేష్ అమెరికా వెళ్లి కంపెనీల సీఈఓ లను కలిసి వచ్చారు. ఈ టూర్ కు సంబదించిన ఫలితాలు ఎలా ఉంటాయో రాబోయే రోజుల్లో కానీ తేలదు.