ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు నారా లోకేష్ ది కీలక పాత్ర. ఇది అందరికి తెలిసిందే. ఆయన ఇప్పుడు మంత్రే అయినా ఒకటి రెండు శాఖలు మినహా ప్రభుత్వంలో ఏమి జరగాలన్నా కూడా ఆయన అనుమతి తప్పనిసరి అని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. కొంత మంది మంత్రులు ఇదే విషయాన్ని తమ సన్నిహితుల వద్ద బహిరంగంగా చెపుతున్నారు కూడా. వాళ్ళ వద్దకు వచ్చే పార్టీ నేతలకు సైతం ..లోకేష్ తో ఒక్క మాట చెప్పించుకోండి మీ పని అయిపోతుంది అని చెపుతున్నారు అని పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇంతటి కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ పై సోమవారం నాటి ఆంధ్ర జ్యోతి పత్రికలో ఒక సంచలన కథనం ప్రచురితం అయింది. అదేంటి అంటే మంత్రి నారా లోకేష్ పేరు చెప్పి సానా సతీష్ అనే వ్యక్తి ఏపీ ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా మారాడు అని, అన్ని ఆయన కనుసన్నల్లోనే సాగుతున్నాయి అంటూ ఏకంగా చక్రం తిప్పుతున్నారు అని రాశారు. కాంట్రాక్టు లు, మైనింగ్, పోస్టింగ్ లు అన్నిటిలోనూ ఆయనే అని అంటూ పేర్కొన్నారు. ఇది టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది. అయితే ఈ విషయం ప్రభుత్వంలోని చాలా మంది మంత్రులకు...పార్టీ కీలక నేతలకు కూడా తెలుసు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఆంధ్ర జ్యోతి పత్రికలో బ్యానర్ గా స్టోరీ వస్తే అటు నారా లోకేష్ తరపునుంచి కానీ..మరొకరి నుంచి కానీ ఇందులో వాస్తవం లేదు అన్న ఖండన రాలేదు. అంటే ఆంధ్ర జ్యోతిలో వచ్చిన విధంగా నారా లోకేష్ కు తెలిసే...ఆయన తరపునే సతీష్ లావాదేవీలు జరుపుతున్నారు అనే అనుమానాలు ప్రజల్లోకి, అధికారుల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది.
సాక్షిలో ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ప్రతికూల వార్త వచ్చినా అటు అధికారులు, కొంత మంది మంత్రులు వెంటనే రియాక్ట్ అయి వివరణలు ఇస్తున్నారు. కానీ ఆంధ్ర జ్యోతిలో ఏకంగా నారా లోకేష్ పేరుతో లింక్ పెట్టి ఇంత పెద్ద సంచలన వార్త వస్తే కనీసం ఖండన కూడా ఇవ్వలేదు అంటే...ఇది మొత్తం లోకేష్ కన్ ఫర్మ్ చేసినట్లు అయింది అనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో సాగుతోంది. నారా లోకేష్ తీరు చూస్తే ఇప్పుడు ఎవరూ తమను ఏమి చేయలేరు అన్న చందంగా ఉంది అని ఒక పార్టీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. మరో వైపు ఇదే సానా సతీష్ ను టీడీపీ తరపున త్వరలోనే రాజ్య సభకు పంపుతారు అని ఆ పార్టీ నాయకులు చెపుతున్నారు. ఆయన ఇప్పుడు నారా లోకేష్ టీంతో పాటు కిమ్ గా పేరుగాంచిన వ్యక్తితో ఎప్పటినుంచో లావాదేవీలు నడుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలో పలు విషయాల్లో ఇంతగా డ్యామేజ్ అవుతుండటం టీడీపీ వర్గాలను కలవరానికి గురిచేస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓన్లీ పంచుడు స్కీములు తప్ప ఏమి పనులు చేయకపోవటం వల్ల అప్పటిలో పెద్దగా స్కాం ల వార్తలు ఉండేవి కావు అని..కానీ ఇప్పుడు మాత్రం గతంలో జరిగిన కొన్ని స్కాం ల సెటిల్ మెంట్స్ తో పాటు కొత్తగా చేపట్టే పనుల విషయాలు చాలానే ఉండే అవకాశం ఉంది అని ఒక అధికారి వ్యాఖ్యానించారు.