జ్యూరిచ్ మీటింగ్ లో మంత్రి టి జీ భరత్
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పంచాయతీ నడుస్తోంది. టీడీపీ నేతలు బహిరంగంగా నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ ను తెరమీదకు తీసుకొస్తున్నారు. తొలుత కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఈ డిమాండ్ లేవనెత్తారు. తర్వాత పార్టీ కి చెందిన కీలక నేతలు అంతా బహిరంగంగా ఇదే డిమాండ్ చేయటం ప్రారంభించారు. దీంతో జనసేన నేతలకు చిర్రెత్తుకొచ్చింది. టీడీపీ నాయకులు తమ నేత నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం తప్పేమి లేదు అని...అలాగే తమకు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఉంది అంటూ తిరుపతి కి చెందిన నేత కిరణ్ రాయల్ ప్రకటించారు. తమతో పాటు కోట్ల మంది బడుగు...బలహీన వర్గాల వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు అన్నారు.
పార్టీ అగ్రనేతల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ముందుకు వెళితే ఎవరికీ ఇబ్బంది ఉండదు అని...అలా కాకుండా చేస్తూ పోతే లేనిపోని సమస్యలు వస్తాయని స్పష్టం చేశారు. అయితే విచిత్రం ఏమిటి అంటే ఇక్కడ ఉన్నంత సేపు ఈ అంశంపై స్పందించని చంద్రబాబు దావోస్ మీటింగ్ కు బయలుదేరి వెళ్లిన తర్వాత లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే అంశంపై ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏ నిర్ణయమైనా కూటమి అధ్యక్షులు కూర్చొని మాట్లాడుకుంటారని, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని ఆదేశించారు. ఒక వైపు లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి పై ఎవరూ మాట్లాడవద్దు అని పార్టీ ఆదేశించినట్లు వార్తలు వచ్చిన కొద్ది గంటలు కూడా గడవముందే జ్యూరిచ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి భవిష్యత్ ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ కామెంట్స్ చేశారు.
ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా జరిగేది ఇదే అన్నారు. ఫ్యూచర్ నారా లోకేష్ దే అంటూ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా అనే మాటలు ఎందుకు ప్రస్తావించారు అన్నది ఇప్పుడు కీలకం గా మారింది. ఒక వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే పదేళ్లు కూడా చంద్రబాబే సీఎం గా ఉండాలి అంటూ అసెంబ్లీ వేదికగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఒక వైపు ఉప ముఖ్యమంత్రి గురించే మాట్లాడవద్దు అని చంద్రబాబు ఆదేశించారు అని చెప్పనట్లు వార్తలు రాగా..టి జీ భరత్ ఏకంగా ఏకంగా భవిష్యత్ సీఎం నారా లోకేష్ అంటూ చెప్పటంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లు అయింది.