అంతా వ్యూహాత్మకమే. కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి అధికారికంగా..బహిరంగ వేదిక మీద నుంచి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని తాము అంతా కోరుకుంటున్నట్లు చెప్పారు. శనివారం నాడు కడప జిల్లా మైదుకూరు లో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో మాట్లాడూతూ శ్రీనివాస రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మీటింగ్ లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. పార్టీకి, భవిష్యత్ లో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ కు ఎలివేషన్ అవసరం అని చెప్పారు. మూడవ తరం నేతగా నారా లోకేష్ వచ్చారు అని...ఆయన్ను డిప్యూటీ సీఎం చేస్తే పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్ ఉంటుంది అన్నారు.
అన్ని రకాలుగా యువతను ప్రోత్సయించే విధంగా ఐటి రంగం, పారిశ్రామిక రంగం నుంచి అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకువచ్చేలా నారా లోకేష్ చేస్తున్న కృషిని ప్రజలు అంతా గమనిస్తున్నారు అని తెలిపారు. ఆయన్ని మరింత ఎలివేట్ చేసి..పార్టీకి ఉజ్వల భవిష్యత్ వచ్చేలా చేస్తారు అని ఆశిస్తున్నట్లు చంద్రబాబు ముందే శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేసి...అయన రెవిన్యూ శాఖను కూడా అప్పగించే అవకాశం ఉంది అని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ముందు అది కూడా కడప జిల్లాలో శ్రీనివాస రెడ్డి ఈ విషయాన్ని లేవనెత్తటం అంతా ఒక వ్యూహం ప్రకారమే చేశారు అనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. చంద్రబాబు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే...ముందు దానికి అనుగుణంగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు అని...అందులో భాగంగానే ఇప్పడు శ్రీనివాస రెడ్డి తో ఈ అంశాన్ని లేవనెత్తించి ఉంటారు అనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.
వాస్తవానికి చంద్రబాబు తర్వాత ప్రభుత్వంలో ఎక్కువ ఎలివేషన్ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మాత్రమే వస్తోంది. కొన్ని శాఖలు మినహా...అనధికారికంగా మొత్తం ప్రభుత్వంపై నారా లోకేష్ కే పట్టు ఉన్నా కూడా టీడీపీ ఇంత బలంగా ఉన్న సమయంలో కూడా నారా లోకేష్ కు రావాల్సినంత ఇమేజ్ రావటం లేదు అనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉంది. అందుకే ఇప్పుడు అటు ఫ్యామిలీ ఒత్తిడి తో పాటు పార్టీ నేతల నుంచి ఈ డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చి మార్చి లేదా ఆ తర్వాత జరిగే క్యాబినెట్ మార్పులు చేర్పుల్లో నారా లోకేష్ కు ఎలివేషన్ ఇచ్చే అవకాశం ఉంది అని చెపుతున్నారు. అందుకే ఎన్టీఆర్ వర్ధంతి రోజు శ్రీనివాస రెడ్డి తో ఈ డిమాండ్ చేయించారు అని చెపుతున్నారు. నారా లోకేష్ కూడా టీడీపీ వ్యవహారాలను పూర్తి గా తన కంట్రోల్ లోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. శనివారం నాడు ఆంధ్ర ప్రదేశ్ పత్రికల్లో ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనల్లో కూడా ఎక్కడా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు లేకుండా..కేవలం ఒక్క లోకేష్ మాత్రమే టీడీపీ లో కోటి సభ్యత్వాల ఘనతను సాధించినట్లు చూపించే ప్రయత్నం చేశారు. ఇది అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే సాగుతున్నట్లు కనిపిస్తోంది అని చెపుతున్నారు.