ఎన్టీఆర్ వర్ధంతికి యాడ్స్ ఇచ్చేది వీళ్లా?!

Update: 2025-01-18 05:08 GMT

ఎవరైనా తండ్రి పేరు నిలబెడతారు. దాని కోసం పని చేస్తారు. కానీ ఇదేంటో మరి టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ ఐటి, మానవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ మాత్రం శనివారం నాడు ఆంధ్ర ప్రదేశ్ లోని పత్రికల్లో ఇప్పించిన ఫుల్ పేజీ యాడ్స్ లో ఎక్కడా కూడా టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు లేకుండా చేశారు అనే చర్చ ఆ పార్టీ నేతల్లో సాగుతోంది. ఇది యాడ్స్ ఇచ్చిన ఎంపీలు...మంత్రులు చేసిన పనా ...లేక నారా లోకేష్ టీం పనా అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శనివారం పలు ప్రధాన పత్రికల్లో వచ్చిన ఫుల్ పేజీ యాడ్స్ లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోటో లు ఉన్నాయి. వీళ్ళతో పాటు ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస రావు ఫోటో లు ఉన్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. కానీ అన్ని పత్రికల్లో వచ్చిన ఫుల్ పేజీ యాడ్స్ లో ఎక్కడా కూడా మచ్చుకైనా కూడా టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరు లేదు.

                                                        లోకేష్ నేతృత్వంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు కోటి సభ్యత్వాలతో ఘననివాళి అంటూ ప్రధానంగా ప్రస్తావించారు. కోటి పైచిలుకు సభ్యత్వాలతో సరికొత్త రికార్డు ను ఆవిష్కరించింది. టీడీపీ యువసారధి లోకేష్ నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు కలిసి ఎన్టీఆర్ కు అందించిన ఘన నివాళి అని అందులో పేర్కొన్నారు. కానీ ఎక్కడా కూడా టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించలేదు. ఒకటే డిజైన్ తో ఈ యాడ్ ను వివిధ పత్రికల్లో ప్రచురించారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే పార్టీ తరపున కాకుండా పార్టీ ఎంపీలు, కొంత మంది మంత్రులకు ఈ యాడ్ అవుట్ సౌర్చింగ్ ఇచ్చినట్లు ఉంది అనే వ్యాఖ్యలు టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. మరి ఇంతటి కీలక సమయంలో ...అధికారంలో ఉండి కూడా..సొంతంగా పార్టీ తరపున కనీసం హాఫ్ పేజీ నో...చివరకు పావు పేజీ నో యాడ్ ఇచ్చి ఉంటే బాగుండేది అని సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.

                                                                          అది కూడా లోకేష్ ను ప్రమోట్ చేసే ఈ యాడ్స్ ఇచ్చింది ఎవరు అంటే ఆంధ్ర జ్యోతి పత్రిక లో కొత్తగా రాజ్య సభ సభ్యత్వం దక్కించుకున్న సానా సతీష్ అయితే..సాక్షిలో ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈనాడు లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఆంధ్ర ప్రభ లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ యాడ్ ఇస్తే...వార్తలో బి సి జనార్దన్ రెడ్డి ఇదే మోడల్ యాడ్ ఇచ్చారు. వీటితో పాటు పలు ఇతర పత్రికల్లో కూడా ఇదే మోడల్ యాడ్ పబ్లిష్ అయింది. అంటే నారా లోకేష్ కు తప్ప ఈ కోటి సభ్యత్వాల విషయంలో చంద్రబాబు పాత్ర ఏమి లేదు ..అంతా తానే చేసినట్లు లోకేష్ చెప్పాలనుకుంటున్నారా అన్న చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది. అయినా కొత్తగా టీడీపీ లో చేరిన వాళ్ళతో..తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళతోనా ఎన్టీఆర్ వర్ధంతికి యాడ్స్ ఇప్పించేది అన్న చర్చ కూడా పార్టీ నేతల్లో సాగుతోంది. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే సాక్షి పత్రిక డబ్బులు వస్తే చాలు ఏమైనా చేస్తుంది అనటానికి ఇదో ఉదాహరణ అని వ్యాఖ్యానిస్తున్నారు టీడీపీ నేతలు. రాజకీయంగా రెండు పార్టీ లు ఉప్పు..నిప్పులా ఉంటాయి. అయినా సరే ఆ పేపర్ టీడీపీ ఫుల్ పేజీ యాడ్ ను యాక్సెప్ట్ చేసి అందరిని షాక్ కు గురి చేసింది. కొంత మంది వైసీపీ నేతలు కూడా ఇది చూసి షాక్ కు గురయ్యారు. టీడీపీ సర్కారు ప్రభుత్వం తరపున మాత్రం సాక్షికి యాడ్స్ ఇవ్వదు అనే విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో కూడా ఆంధ్ర జ్యోతి పత్రికకు ఇలాగే జగన్ సర్కారు యాడ్స్ ఇవ్వలేదు. మొత్తానికి లోకేష్ అండ్ టీం ఈ యాడ్స్ ద్వారా చంద్రబాబు పేరు లేకుండా చేశారు అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.

Tags:    

Similar News