వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సినిమా పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్ళకు అసలు ఏపీ గుర్తుందా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ గుర్తున్నాడా? అంటూ ప్రశ్నలు సంధించారు. తమ ప్రభుత్వంలో మాఫియా నేతలు ఎవరూ లేరన్నారు. సినిమా టిక్కెట్ ధరలు తగ్గిస్తే పొట్టగొట్టినట్లా అని ప్రశ్నించారు. పేదలు వినోదం కోసం వెళితే వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని తెలిపారు. హీరోలు హైదరాబాద్ లో ఉంటూ తెలంగాణలో సినిమాలు తీస్తున్నారన్నారు. వాళ్లు కోట్లు ఆర్జిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.
పరిశ్రమలో చంద్రబాబు మనుషులు, తన సామాజికవర్గం వాళ్ళు ఉన్నారు కాబట్టే ఆయన మద్దతు ఇస్తున్నారు. చంద్రబాబు తన హయాంలో వాళ్లు బలిసేలా చేశారన్నారు. చంద్రబాబు హయాంలోనే మాఫియా గ్యాంగులు ఉన్నాయన్నారు. పేదలకు అందుబాటులో ఉండాలనే ప్రభుత్వం టిక్కెట్ ధరలు తగ్గించిందన్నారన్నారు. పేదల కోసం టిక్కెట్ ధరలు తగ్గిస్తే చంద్రబాబుకు బాధ ఏంటి అని ప్రశ్నించారు. సినిమా టిక్కెట్లకు సంబంధించిన అంశంపై గత కొన్ని రోజులుగా వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఏ మాత్రం గిట్టుబాటు కావంటూ పలు థియేటర్లు కూడా మూతపడిన విషయం తెలిసిందే.