Full Viewఎవరూ కూడా ఆయన పేరు ఊహించలేదు. అసలు ఎక్కడా చర్చ కూడా లేదు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కొట్టు సత్యనారాయణ పేరు సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ జాబితాలో చేరింది. అంతే కాదు ఆయన ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. పోనీ ఆ సామాజిక వర్గ నేతలకు తక్కువ సంఖ్యలో పదవులు ఉన్నాయని కొట్టు సత్యనారాయణను తెరపైకి తీసుకొచ్చారా అనుకోవటానికి లేదు.చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఆ సామాజికవర్గ నేతలు మంత్రి పదవులు పొందారు. వైసీపీలో ఉన్న ఇతర నేతలతో పోలిస్తే కొట్టు సత్యనారాయణ ఏమైనా సీరియస్ పోటీదారా అంటే అదీ కూడా కాదు. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి నేతల్లాగా ఆయన జిల్లా వ్యాప్తంగా ఆయన ప్రభావితం చేయగల నేతా అంటే అదీ కాదు. అసలు ఆయనకు మంత్రి పదవి ఎలా వచ్చిందా అన్న అంశంపై చర్చలు సాగుతున్న తరుణంలో విశాఖపట్నానికి చెందిన టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఓ బాంబు పేల్చారు. ఇది ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇది చూసిన తర్వాత చాలా మంది ఓహో..కొట్టు సత్యనారాయణకు మంత్రి పదవి దక్కటం వెనక ఇంత పెద్ద కథ నడిచిందా అన్న చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో.
బండారు సత్యనారాయణ మూర్తి చేసిన ఆరోపణల్లో నిజనిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలియదు కానీ..ఆయన ఈ సబ్జెక్ట్ కు చేసిన లింక్ చూస్తే మాత్రం ఎవరికైనా అనుమానాలు రాకమానదు అని గట్టిగా చెప్పొచ్చు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకున్నా ఈ వ్యవహారం మాత్రం ఖచ్చితంగా పలు అనుమానాలకు తావిచ్చేదిలాగా ఉందని అధికార వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి. ఎన్ సీసీకి దక్కిన వేల కోట్ల రూపాయల విలువైన భూమి కొట్టు సత్యనారాయణ సోదరుడికి చెందిన జీఆర్ పీఎల్ హౌసింగ్ చేతికి మారిందని బండారు సత్యానారాయణ మూర్తి తెలిపారు. ఈ భూమి విలువ వెయ్యి కోట్ల రూపాయలపైనే ఉంటుందని తెలిపారు. అదే సమయంలో కొట్టు సత్యనారాయణ సోదరుడు అయిన కొట్టు మరళీక్రిష్ణకు చెందిన మరో ప్రాజెక్టులోని విశాలమైన స్థలంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విలాసవంతమైన భవనం నిర్మిస్తున్నారని, ఇది వారి మధ్య కుమ్మక్కుకు నిదర్శనం అని ఆయన ఆరోపించారు.