నారా లోకేష్. ఏపీ ప్రభుత్వంలో కీలక మంత్రి. భవిష్యత్ ముఖ్యమంత్రిగా ప్రచారం ఉన్న నాయకుడు. అలాంటి నేత ఎంత జాగ్రత్తగా ఉండాలి. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఏ ఇమేజ్ తో అయితే దెబ్బతిన్నారో అందరికి తెలిసిందే. అయినా కూడా నారా లోకేష్ పెద్దల సభగా వ్యవహరించే ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కి చెందిన మహిళా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మంగళవారం నాడు మండలిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కాదు అని..ఈ ప్లాంట్ పునద్ధరణ కోసం కేంద్రం 11400 కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయం గురించి కూడా లోకేష్ ప్రస్తావించారు. అదే సమయంలో మహిళా సభ్యురాలు ఈ ప్రశ్న అడిగిన సమయంలో నారా లోకేష్ మీరు పీకింది ఏంటి...ఐదేళ్లు మీరు ఏమి పీకారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. నారా లోకేష్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని..లేదా రికార్డు ల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అయినా సరే నారా లోకేష్ మహిళల ను అవమానించటం గురించి వైసీపీ మాట్లాడితే ఎవరూ నమ్మరు అని..తన తల్లిని అవమానించిన విషయాన్ని ప్రస్తావించారు. ఒక మహిళ ప్రశ్న అడిగిన సమయంలో మంత్రి నారా లోకేష్ స్పందించిన తీరు ఏ మాత్రం సరిగా లేదు అని..వైసీపీ కి సమాధానం గట్టిగా చెప్పటానికి సభలో ఇలాంటి భాష ఉపయోగించటం ఏ మాత్రం సరికాదు అని టీడీపీ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరో వైపు కియా విషయంలో నారా లోకేష్ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాకు ఆ పరిశ్రమ రావటం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందిన మాట వాస్తవమే అయినా..ఆయన చెప్పిన లెక్కలు విని అధికారులతో పాటు టీడీపీ నాయకులు కూడా షాక్ కు గురి అవుతున్నారు.
కియా రాకముందు ప్రజల తలసరి ఆదాయం 70 వేలు ఉంటే ..కియా వచ్చిన తర్వాత ఇది 2 .30 లక్షల పెరిగింది అన్నారు. ఇక్కడ లోకేష్ చాలా కన్వీనెంట్ గా ఆ పరిశ్రమకు ఇచ్చిన మొత్తం రాయితీలు ఎన్ని అనే విషయం మాత్రం చెప్పరు. తలసరి ఆదాయం పెరగటానికి నారా లోకేష్ చెప్పినట్లు ఒక్క కియా పరిశ్రమే అంత ప్రభావం చూపించి ఉంటే ఇక ఆయన తెచ్చే పరిశ్రమలతో ఆంధ్ర ప్రదేశ్ రాబోయే రోజుల్లో ఎక్కడికో వెళుతుంది అంటూ ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. ఒక్క రోజే ఆయన ఇలా రెండు విషయాల్లో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్లు అయింది అనే అభిప్రాయం టీడీపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు.