విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని అస్త్ర సన్యాసం చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. మొన్నటి ఎన్నికల ముందు తెలుగు దేశం పార్టీ ని వీడి వైసీపీ లో చేరిన కేశినేని నాని ఆ పార్టీ తరపున విజయవాడ లోక్ సభ బరిలో నిలిచారు. చివరకు టీడీపీ అభ్యర్థి..అది కూడా సొంత తమ్ముడు కేశినేని శివనాథ్ చేతిలో పరాజయం పాలు అయ్యారు. ఫలితాల వెల్లడి అనంతరం ఇటీవల వైసీపీ నేతలు ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. మాజీ మంత్రులు..ఇతర నేతలను నుంచోపెట్టి జగన్ వాళ్ళతో మాట్లాడారు. ఈ గ్రూప్ లో కేశినేని నాని కూడా ఉన్నారు. అయితే ఆయన వీళ్లకు చాలా దూరంలో నిల్చుని...తర్వాత అక్కడ ఉన్న సోఫా లో కూర్చున్నారు. ఇవి అన్ని నచ్చలేదో..లేక ఇతర కారణలో తెలియదు కానీ రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నట్లు సోమవారం సాయంత్రం కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాననని అందులో పేర్కొన్నారు. రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపూర్వమైన గౌరవం అని, విజయవాడ ప్రజల స్థైర్యం, దృఢసంకల్పం తనకు స్ఫూర్తినిచ్చాయి అన్నారు. తాను రాజకీయ రంగానికి దూరంగా ఉన్నా.. విజయవాడపై తన నిబద్ధత బలంగానే ఉంటుంది అని, విజయవాడ అభివృద్ధికి తాను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటానని తెలిపారు. రాజకీయ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. విజయవాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు అంటూ కేశినేని నాని ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే తన పేస్ బుక్ పేజీ లో వైసీపీ అధినేత జగన్ తో ఉన్న ప్రొఫైల్ ను కూడా తీసివేశారు.