ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా ఏపీ సర్కారు, న్యాయవ్యవస్థతో ఘర్షణ పడుతోంది. దీనిపై ఏకంగా సుప్రీంకోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా కొంత మంది న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఇది దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. వైఎస్ జగన్ కు గత కొంత కాలంగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జాస్తి చలమేశ్వర్ సన్నిహితంగా ఉంటున్నారు.
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనల్లో కూడా చలమేశ్వర్ తనయుడు ఆయన తో కలసి వెళ్ళినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు జాస్తి చలమేశ్వర్ తనయుడు జాస్తి నాగభూషణ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఈ పదవిలో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుబ్రమణ్యం శ్రీరామ్ అడ్వొకేట్ జనరల్‌గా ఉన్నారు. ఆయన తర్వాత జాస్తి నాగభూషన్ అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు.