బలం లేని బీజేపీ కోసం జన సేన త్యాగం

Update: 2024-03-12 13:07 GMT

Full Viewరాజకీయ నాయకులు తాము ఏమి చేసినా దేశం కోసం..రాష్ట్రం కోసమే అని చెపుతారు. అయితే వీటిని ప్రజలు నమ్ముతున్నారా లేదా అనే అంశాలతో మాత్రం వాళ్లకు సంబంధం ఉండదు. వాళ్ళు చెప్పే మాటలు చెప్పి అలా ముందుకు సాగుతారు. ఆంధ్ర ప్రదేశ్ లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూసిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మాత్రం అందరూ ‘త్యాగరాజు’ గా పిలుస్తున్నారు. ఇప్పటికే జన సేన లీడర్లు, క్యాడర్ లో పవన్ కళ్యాణ్ పొత్తు కోసం రాజీ పడ్డారు అనే అభిప్రాయం ఉంది. కొద్ది రోజుల క్రితం తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ఉమ్మడిగా రెండు పార్టీలకు చెందిన తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే పొత్తులో భాగంగా జనసేన కు 24 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై విమర్శలు రాగా పవన్ కళ్యాణ్ లోక్ సభ సీట్ల ను కూడా పరిగణనలోకి తీసుకుంటే తమకు మొత్తం 40 వరకు అసెంబ్లీ సీట్లు వచ్చినట్లు అంటూ అప్పటిలో ఒక వింత లెక్క చెప్పారు . 24 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లకు ఒప్పుకోవటాన్ని పవన్ కళ్యాణ్ గట్టిగా సమర్ధించుకున్నారు.

                                                                        గత అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి ఉంటే ఇప్పుడు గట్టిగా డిమాండ్ చేయటానికి ఛాన్స్ ఉండేది అని పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. సీన్ కట్ చేస్తే కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత జనసేన తనకు ఉన్న మూడు ఎంపీ సీట్లలో ఒక దాన్ని...24 అసెంబ్లీ సీట్లలో మూడు సీట్లను బీజేపీ కోసం త్యాగం చేసింది. ఇది ఇప్పుడు జనసేన నాయకులు...క్యాడర్ ను మరింత ఇరకాటంలోకి నెట్టే పరిణామంగా మారింది అని చెప్పాలి. సీట్ల పంపకం విషయంలో రాష్ట్ర భవిష్యత్ కు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి ఒక అంగీకారానికి వచ్చినట్లు అధికారికంగా వెల్లడించారు పవన్ . ఎన్ డీ ఏ భాగస్వాములుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం అని వెల్లడించారు. తుది ఒప్పందం ప్రకారం టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్ సభ సీట్లలో పోటీ చేయనుంది. టీడీపీ మొదట అనుకున్న దానికంటే బీజేపీ కోసం ఒక అసెంబ్లీ సీటు తగ్గించుకుంది. బీజేపీ ఆరు లోక్ సభ, పది అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనుంది. జనసేన రెండు లోక్ సభ, 21 అసెంబ్లీ సీట్లలో బరిలో నిలవనుంది. లోక్ సభ సీట్ల విషయంలో ఎలా ఉన్నా బీజేపీ కి పది అసెంబ్లీ సీట్లు ఇవ్వటం పై మాత్రం అటు టీడీపీ, ఇటు జన సేన వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. 

Tags:    

Similar News