వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి

Update: 2026-07-01 09:41 GMT

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మావిగన్‌ మోడల్ క్యాపిటల్ కే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు కూడా అమరావతి వర్సస్ మావిగన్‌ గానే సాగుతాయి అని తెలిపారు. మావిగన్‌ స్లోగన్ నచ్చినవాళ్ళే తమకు ఓటు వేస్తారు అంటూ కూడా స్పష్టం చేశారు. తమ మేనిఫెస్టో లో కూడా మావిగన్‌ ను చేరుస్తాం అని...ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో చూద్దాం అని ప్రకటించారు. ఎలాంటి అవినీతి లేకుండా మావిగన్‌ ను పూర్తి చేస్తామన్నారు. జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు తాడేపల్లి లోని తన నివాసంలో మీడియా తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు లేవు అని...మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే అరాచక పాలన సాగుతోంది అని ఆరోపించారు. ఒక వైపు జగన్ మోహన్ రెడ్డి తమ విధానం మావిగన్‌ అని చెపుతూనే తాము అమరావతికి వ్యతిరేకం కాదు..అక్కడ జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకం అంటూ వ్యాఖ్యానించటం విశేషం. ఇవి అన్నీ చూసి జగన్ కన్ఫ్యూషన్ లో ఉన్నారా లేక ప్రజలను కన్ఫ్యూషన్ లోకి నెట్టాలని చూస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

                                ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అమరావతిలో దగ్గర దగ్గర అరవై వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఐకానిక్ టవర్స్ తో పాటు వివిధ రకాల పనులు చేపట్టిన విషయం తెలిసిందే. అయినా సరే జగన్ మోహన్ రెడ్డి మాత్రం తమ విధానం మావిగన్ మాత్రమే అని ప్రకటించటంతో ఇప్పుడు వ్యవహారం అత్యంత కీలకంగా మారింది అనే చెప్పాలి. ఒక వైపు కేంద్రం కూడా రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేసి మరీ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అని చట్టంలో చేర్చింది. కానీ జగన్ మాత్రం అమరావతి విషయం లో తాను రాజీపడేది లేదు అని తేల్చి చెపుతున్నారు.

                              Full Viewవచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతి కొనసాగదు అనే సంకేతాలు జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా ఇచ్చారు. మరో వైపు ఇప్పుడు అమరావతిలో రాజధాని పనులు అనుకున్నంత వేగంగా సాగటం లేదు అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇలా సాగితే షెడ్యూల్ ప్రకారం ఐకానిక్ టవర్స్ తో పాటు రాజధానిలో ఇతర పనులు కూడా పూర్తి అవ్వవు అని...ఎన్నికల్లో ప్రభుత్వం మారితే మాత్రం మళ్ళీ వ్యవహారం మొదటికి వస్తుంది అనే చర్చ టీడీపీ నేతల్లో కూడా ఉంది. పార్లమెంట్ లో చట్ట సవరణ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అని అధికారికంగా ప్రకటించినా కూడా జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో రాజధాని ఎజెండా తోనే ఎన్నికలకు వెళతాం అని ప్రకటించటం ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు అనే చెప్పొచ్చు.

Tags:    

Similar News