వర్క్ ఫ్రమ్ హోమ్‌ సీఎంగా జగన్

Update: 2023-08-18 06:55 GMT

Full Viewవైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు కావస్తోంది. మరో ఆరు నెలల్లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. కానీ అయన మాత్రం పాలన అంతా తాడేపల్లి నివాసం కమ్ క్యాంపు ఆఫీస్ నుంచే సాగిస్తున్నారు. దీంతో జగన్ ది ఇంటి పాలనగా మారిపోయింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్యాబినెట్ సమావేశాలు ఉన్నప్పుడు తప్ప సీఎం జగన్ సచివాలయం వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో అయన ఎప్పుడూ రాజధానిలో ప్రజలను కలుసుకున్న దాఖలాలు లేవు. వివిధ కార్యక్రమాలు..బటన్ నొక్కే మీటింగ్ ల్లో పాల్గొనే సమయంలో తప్ప తాడేపల్లి నుంచి బయటకు రావటం లేదు. జగన్ తాడేపల్లి నివాసం నుంచి సెక్రటేరియట్ కు ఏమైనా పెద్ద దూరం ఉంటుందా అంటే తిప్పి కొడితే పది కిలోమీటర్లు కూడా ఉండదు. అయినా సరే సీఎం జగన్ ఇల్లు దాటి బయటకు రావటం లేదు. దీంతో శాఖల సమీక్షలు కూడా తాడేపల్లి క్యాంపు ఆఫీస్ లోనే జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ సచివాలయానికి రాకపోవటంతో మంత్రులు...ఐఏఎస్ లది కూడా ఇష్టారాజ్యం అయిపొయింది అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. స్వయంగా సీఎం జగన్ అసలు సచివాలయం వైపు కన్నెత్తి చూడకపోవటంతో కొంత మంది ఐఏఎస్ లు కూడా ఇళ్ల దగ్గర నుంచే పనులు చేస్తున్నారు అని చెపుతున్నారు. మంత్రులది అదే తీరు. స్వయంగా సీఎం పేషీ లోని అధికారుల డిజిటల్ సిగ్నేచర్ లను కొంత మంది ఉద్యోగులు దుర్వినియోగం చేసిన విషయం తెలిసిందే. పరిపాలన వైఫల్యానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అని ..సీఎం , మంత్రులు, ఐఏఎస్ లు నిత్యం సచివాలయానికి వస్తేనే పరిపాలన సజావుగా సాగటం కష్టం అని...అలాంటిది ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చెపుతున్నారు. సీఎం జగన్ క్యాంపు ఆఫీస్ లోకి రివ్యూ ఉన్నశాఖల ఐఏఎస్ లు తప్ప...ఇతరులు అంటే...చివరకు సిఎస్ అయినా కూడా సరే పేరు లేకపోతే లోపలికి వెళ్లే ఛాన్స్ ఉండదు అని ఒక ఐఏఎస్ చెప్పారు.

                            గతంలో ఒక సిఎస్ ఇలాగే గేట్ దగ్గరనుంచి వెనక్కి వెళ్లిపోయారు అని అయన వెల్లడించారు. ఐటి ఉద్యోగుల తరహాలో జగన్ కూడా వర్క్ ఫ్రం హోం సీఎం గా మారిపోయారు అని చెపుతున్నారు. కరోనా సమయంలో కొన్ని నెలల పాటు లాక్ డౌన్ విధించారు..కానీ సీఎం జగన్ తనకు తాను నాలుగున్నర సంవత్సరాలుగా లాక్ డౌన్ లో ఉన్నట్లు ఉంది అని ఒక ఐఏఎస్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత కొంత కాలంగా సీఎం జగన్ తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ని ముసలాయన..ముసలాయన అని సంబోధిస్తున్నారు. వయసును ఎవరూ ఆపలేరు. కానీ సీఎం జగన్ కంటే చంద్రబాబు ఈ వయసులోనూ దేనికోసం అయినా సరే ప్రజల్లో ఎక్కువగా తిరుగుతున్నారు అని కొంత మంది ఐఏఎస్ లు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుతో పోలిస్తే సీఎం జగన్ ఎంతో యువకుడు అయి ఉండి కూడా ఇలా ఇంటి నుంచి పాలన సాగించటం ఏమిటి?...ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుంది అనే అభిప్రాయం కూడా కొంత మంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడివరకో ఎందుకు జగన్ ఫ్యామిలీకి చెందిన సాక్షి పత్రిక ఉద్యోగులు తాము కూడా ఇంటి దగ్గర నుంచే పని చేస్తాం అంటే యాజమాన్యం అందుకు అంగీకరిస్తుందా అని ఒక ఐఏఎస్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చేందుకు సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్....అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు బిన్నంగా ఇంట్లో నుంచి బయటకు రాకుండా పాలన సాగించటం అంటే అది ఖచ్చితంగా రాజకీయంగా నష్టం చేసే అంశమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News