తెలంగాణ కంటే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వమే జగన్ కు సేఫా?!

Update: 2024-08-02 14:14 GMT

వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కంటే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం బెటర్ అనుకుంటున్నారా?. హైదరాబాద్ కంటే తనకు బెంగళూరు మాత్రమే సురక్షితం అయిన ప్లేస్ అనుకుంటున్నారా?. గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత జగన్ ఒక్కసారి కూడా హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ నివాసానికి వెళ్ళలేదు. కానీ ఇప్పటికే ఆయన పలు మార్లు మాత్రం బెంగళూరు నివాసానికి వెళ్లారు. 2019 ఎన్నికలకు ముందు వరకు...తాడేపల్లి లో నిర్మాణం పూర్తి అయ్యే వరకు ప్రతిపక్షంలో ఉండగా జగన్ ఎక్కువగా హైదరాబాద్ లోనే నివాసం ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. జగన్ కు కెసిఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. కానీ మొన్నటి ఎన్నికలతో లెక్కలు అన్ని మారిపోయాయి. తెలంగాణ లో కెసిఆర్, ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ఓటమి పాలు అయిన విషయం తెలిసిందే.

                                            ఎన్నికల్లో పరాజయం పాలు అయినప్పటి నుంచి ఆయన తాడేపల్లి టూ బెంగళూరు జర్నీ చేస్తున్నారు. తాడేపల్లి కంటే ఆయన బెంగళూరు లోనే ఎక్కువ ఉంటున్నారు అనే చర్చ కూడా సాగుతోంది. దీంతో జగన్ కూడా ఇప్పుడు నాన్ రెసిడెంట్ అఫ్ ఆంధ్ర (ఎన్ఆర్ఏ)గా మారిపోయారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే జగన్ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ లు హైదరాబాద్ లో ఉంటూ ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ కు వస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అదే జగన్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని రోజులు...బెంగళూరు లో కొన్ని రోజులు అన్న చందంగా అటు ఇటు తిరుగుతున్నారు. గతంలో ఎన్నడూ లేనిది జగన్ ఓటమి తర్వాత నిత్యం బెంగళూరు వెళుతుండటం అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

Tags:    

Similar News