ఐఏఎస్ అయినా..ఐపీఎస్ అయినా నిబంధనలు ప్రకారం చేస్తే ఏ ఇబ్బందీ ఉండదు. కానీ పొలిటికల్ బాస్ లు చెప్పారు అని ఏది పడితే అది చేస్తే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎఫెక్ట్ ఇప్పుడు ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై పడింది. అప్పటి సీఎం జగన్ కు సన్నిహితుడు అయిన ఒక పారిశ్రామికవేత్తను కాపాడేందుకు రంగంలోకి దిగిన ఈ ఐపీఎస్ లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై విచారణకు ఆదేశించింది.
ఇప్పుడు ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. విచిత్రం ఏమిటి అంటే ముంబయి కి చెందిన నటి కాదంబరి జత్వాని విషయంలో ఐపీఎస్ అధికారులుగా ఉన్న వీళ్ళు ఇష్టానుసారం వ్యవరించారు అనే ఆరోపణలు ఎదుర్కోవటమే పరువుతక్కువ వ్యవహారం అన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఇప్పుడు ఏకంగా ఇదే కారణంతో సస్పెండ్ అవ్వటం అన్నది పరాకాష్ట. ఈ కేసు లో అంతిమంగా ఏమి జరుగుతుందో తెలియదు కానీ...ఖచ్చితంగా ఈ పరిణామం మాత్రం ఆ ముగ్గురు అధికారుల కెరీర్ లో పెద్ద మచ్చగా మిగిలిపోవటం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముంబయి నటి కాదంబరి జత్వాని ని ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కోసం తప్పుడు కేసు లో ఇరికించి వేధింపులకు గురిచేయడంతో పాటు గత ప్రభుత్వంలో వీళ్ళు వైసీపీ సర్కారు కు...ముఖ్యంగా అప్పటి సీఎం జగన్ ఏది చెపితే అది నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేశారు అని టీడీపీ సర్కారు ఆరోపిస్తోంది.
అందుకే వీళ్లకు మూడు నెలలుగా పోస్టింగ్ కూడా ఇవ్వకుండా పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ సర్కారు తాజాగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరానా తాతా, విశాల్ గున్నిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. ఒక నటిని వేధించిన కేసు లో ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒకేసారి సస్పెన్షన్ కు గురవటం అన్నది హాట్ టాపిక్ గా మారింది.