అప్పుడు సజ్జల...ఇప్పుడు లోకేష్ !

Update: 2026-07-07 08:21 GMT

వైసీపీ హయాంలో అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని సకల శాఖ మంత్రి అని పిలిచేవాళ్ళు. ఆయన మంత్రి కాకపోయినా సీనియర్ మంత్రులను పక్కన పెట్టుకుని కూడా అప్పటిలో అన్ని ప్రభుత్వ విధాన నిర్ణయాలను ఆయనే ప్రకటించేవారు. అందుకే సజ్జలకు ఆ పేరు వచ్చింది. జగన్ మోహన్ రెడ్డిని కలవాలంటే ముందు ఏ విషయం అయినా సజ్జలకు చెపితే తప్ప పని జరిగే పరిస్థితి ఉండేది కాదు కానీ వైసీపీ నేతలు అప్పటిలో బహిరంగంగానే చెప్పేవాళ్ళు. వైసీపీ హయాంలో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా మంత్రి నారా లోకేష్ కు అదే పేరు ఉంది అని కొంత మంది మంత్రులే అభిప్రాయపడుతున్నారు. నారా లోకేష్ అధికారికంగా ఐటి శాఖ తో పాటు మానవనరులు...రియల్ టైం గవర్నెన్స్ వంటి విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో కర్నూల్ జిల్లాకు చెందిన టి జీ భరత్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు చూస్తున్నారు. కానీ పేరుకు పరిశ్రమల శాఖ మంత్రి టి జీ భరత్ అయినా కూడా ఈ శాఖను పూర్తిగా మంత్రి నారా లోకేష్ కంట్రోల్ చేస్తున్నారు అనే చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది.

                                     పెట్టుబడుల సాధన కోసం అంటూ నారా లోకేష్ ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించటం...ఉపాధి అవకాశాలు పెంచటం మంచిదే. దాన్ని ఎవరూ తప్పుపట్టారు. కానీ అసలు ఆ శాఖ మంత్రిని పూర్తిగా పక్కన పెట్టి మొత్తం నారా లోకేష్ అన్న చందంగానే వ్యవహరిస్తుండం ఇప్పడు రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో కూడా ఎక్కడా టి జి భరత్ కు చోటుదక్కలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు అన్నీ కూడా తనతో పాటు నారా లోకేష్ కృషితోనే వస్తున్నాయి అని చెపుతున్నారు. అంతే కాదు ఒక్క ఐటి శాఖ పరిధిలోనే కాదు...రాష్ట్రంలో పలు కీలక పరిశ్రమల శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు కూడా పరిశ్రమల శాఖ మంత్రి లేకుండా నారా లోకేషే ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో ఆయా శాఖల మంత్రుల ఫోటో లు వేయకుండా ప్రతి ప్రకటనలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మాత్రమే వేస్తున్నారు. అంతే కాదు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో కీలక శాఖల్లో ఇప్పుడు మంత్రి నారా లోకేష్ హవానే ఎక్కువ నడుస్తుంది అనే చర్చ టీడీపీ నాయకుల్లోనే ఉంది.

                                         ముఖ్యంగా విద్యుత్ శాఖ తో పాటు మున్సిపల్, మైనింగ్, రెవిన్యూ వంటి శాఖల్లో నారా లోకేష్ లోకేష్ కు తెలియకుండా ఏమి జరగటం లేదు అనే ప్రచారం మంత్రుల్లోనే ఉంది. రాజధాని అమరావతిలో తనకు తెలియకుండా ఏమి జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఇటీవల సిఆర్ డీఏ కమిషనర్ గా తనకు ఎంతో సన్నిహితుడు అయిన విజయరామరాజును అక్కడ నియమించారు అనే ప్రచారం అటు అధికార వర్గాలతో పాటు టీడీపీ నేతల్లో కూడా బలంగా ఉంది. అందుకే విజయరామ రాజు ఈ పదవిలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి నారాయణ ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు అనే ప్రచారం ఆ శాఖ వర్గాల్లో ఉంది. అంతే కాకుండా పలు కీలక శాఖల విషయంలో మంత్రి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితులుగా పేరున్న వాళ్ళు పెద్ద ఎత్తున జోక్యం చేసుకుంటున్నారు అని..పోస్టింగ్ ల దగ్గర నుంచి...కీలక పనుల విషయంలో వీళ్ళ పెత్తనమే నడుస్తుంది అని ఒక సీనియర్ మంత్రి వెల్లడించారు. వీళ్ళు అధికారికంగా ఎక్కడా పైకి కనిపించకపోయినా అంతా ఫోన్లలోనే...తమ మునుషుల ద్వారా పనులు నడిపిస్తున్నారు అనే ప్రచారం టీడీపీ నేతల్లోనే బలంగా సాగుతోంది. దీంతో ప్రభుత్వం మారినా కూడా శాఖల శాఖ మంత్రిగా ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. ఒకప్పుడు అన్ని శాఖలపై అజమాయిషీ ఒక్క ముఖ్యమంత్రికి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి అని మరో మంత్రి అభిప్రాయపడ్డారు.

Full View

Tags:    

Similar News