ఇండీచిప్ సెమికండక్టర్స్ 14 వేల కోట్ల పెట్టుబడి గోల్ మాల్ వెనక కథ ఏంటో?!
ఏ మాత్రం అనుభవం లేని కంపెనీ తో హంగామా ఎందుకో !
ఇదేదో భారీ గోల్ మాల్ వ్యవహహారంగా కనిపిస్తోంది. ఆ కంపెనీ ప్రతినిధులు ముందు ఏపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఆ తర్వాత కంపెనీ పెట్టారు. ఇండీచిప్ సెమికండక్టర్స్ లిమిటెడ్ వ్యవహారం ఇది. ఈ కంపెనీ నమోదు అయింది 2025 జనవరి 2 న. మినిస్ట్రీ అఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఎంసిఏ) డేటా నే ఈ విషయం చెపుతోంది. కాన్పూర్ ఆర్ఓసి లో ఇది నమోదు అయింది. ఈ కంపెనీ అధీకృత మూలధనం కోటి రూపాయలు...పెయిడ్ అప్ క్యాపిటల్ కూడా కోటి రూపాయలే. కోటి రూపాయల అధీకృత మూలధనం తో కూడిన కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ లో ఏకంగా 14000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టానికి ముందుకు వచ్చింది. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే 2024 డిసెంబర్ 21 న ఈ కంపెనీ ప్రతినిధుల బృందం మంత్రులు నారా లోకేష్ తో పాటు పరిశ్రమల శాఖా మంత్రి టి జీ భరత్ తో భేటీ అయ్యారు. అంటే ఇండీచిప్ సెమికండక్టర్స్ లిమిటెడ్ ప్రతినిధులు అసలు కంపెనీ ఇన్ కార్పొరేట్ చేయక ముందే లోకేష్ ని కలిసి...అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత కంపెనీ ని నమోదు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
లోకేష్, భరత్ లను కలిసిన సమయంలోనే జపాన్ కు చెందిన కంపెనీ ఇండియాలోని ఒక ఐటి కంపెనీ తో కలిసి ఈ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఓర్వకల్ లో ఈ కంపెనీ 130 ఎకరాల్లో తన యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు, ఐటి శాఖ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇండీచిప్ సెమికండక్టర్స్ లిమిటెడ్ కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ లో యూనిట్ ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చింది. అంతే కాదు ఏకంగా 14 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టానికి ఏపీ ఐటి మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టి జీ భరత్ ల సమక్షంలో అవగాహనా ఒప్పందం చేసుకున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
జపాన్ కు చెందిన ఇటోయ మైక్రో టెక్నాలజీ (వైఎంటి) భాగస్వామ్యంతో ఈ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతిపాదిత యూనిట్ ద్వారా నెలకు పదివేల వేఫర్లు తయారు చేస్తారు అని..రెండు, మూడు సంవత్సరాల్లో ఈ సంఖ్యను 50 వేలకు పెంచుతారు అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా ఈ కంపెనీ తో కుదిరిన ఒప్పందం విషయం షేర్ చేశారు. జపాన్ కంపెనీ కి ఈ రంగంలో అనుభవం ఉన్నా కూడా భారతీయ భాగస్వామ్య కంపెనీ పుట్టి కూడా నెల రోజులు కాకుండానే ఎలా 14000 వేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రకటన చేసింది. అసలు కంపెనీ పుట్టక ముందే వీళ్ళు ఎలా మంత్రులు నారా లోకేష్, టి జీ భరత్ లను కలిశారు. ఈ భేటీ తర్వాత కంపెనీని ఇన్ కార్పొరేట్ చేయటంతో దీని వెనక ఏదో పెద్ద గోల్ మాల్ వ్యవహారమే ఉండి ఉంటుంది అనే అనుమానాలు అధికార వర్గాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో వేచిచూడాలి.